ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘జెరియాట్రిక్‌’ వార్డులు | Geriatric wards in government hospitals | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘జెరియాట్రిక్‌’ వార్డులు

Nov 20 2025 4:10 AM | Updated on Nov 20 2025 4:10 AM

Geriatric wards in government hospitals

వృద్ధుల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బెడ్లు, పర్యవేక్షణ 

అన్ని జిల్లాల ప్రభుత్వఆస్పత్రుల్లో 20 బెడ్లతో ప్రత్యేక వార్డుల ఏర్పాటు 

జ్ఞాపకశక్తి సమస్యలకు చికిత్స

ఫిజియోథెరపీ, న్యూట్రిషన్‌ కౌన్సెలింగ్‌ తదితర సేవలు

సాక్షి, హైదరాబాద్‌  :  వృద్ధాప్యంలో వచ్చే జబ్బులకు చికిత్స.. ఇతర మానసిక, శారీరక సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో అన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా జెరియాట్రిక్‌ వార్డులను ఏర్పాటు చేయనున్నారు. పెరిగిన జీవన ప్రమాణాలతో ఆయురార్థం వృద్ధి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల తరహాలో మన దగ్గర కూడా వృద్ధుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నారు. 

కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ ప్రోగ్రాం ఫర్‌ హెల్త్‌ కేర్‌ ఆ‹ఫ్‌ ది ఎల్డర్లీ (ఎన్‌పీహెచ్‌సీఈ) పథకం ద్వారా జిల్లా ఆస్పత్రులలో జెరియాట్రిక్‌ ఓపీడీలు , ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇప్పటికే రాజస్తాన్‌లో ‘రామశ్రే’పేరుతో 49 జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులలో జెరియాట్రిక్‌ వార్డులు ప్రారంభమయ్యాయి. కేరళలో తాలుకా, జిల్లా స్థాయి ప్రభుత్వ ఆస్పత్రుల్లో జెరియాట్రిక్‌ క్లినిక్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ కోవలోనే మన రాష్ట్రంలో కూడా ఎన్‌పీహెచ్‌సీఈ పథకంతో అనుసంధానం చేస్తూ 33 జిల్లా ఆస్పత్రులతోపాటు హైదరాబాద్‌లోని అన్ని జనరల్‌ ఆస్పత్రుల్లో జెరియాట్రిక్‌ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాల్లో వార్డుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 

65 ఏళ్లు పైబడిన వృద్ధుల సేవల కోసం 
65 ఏళ్ల పైబడిన వృద్ధులు సాధారణ జనరల్‌ ఆస్పత్రులకు రావడం ఇబ్బందిగా మారింది. సాధారణ రోగుల తరహాలో వారికి ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషంట్‌ సేవలు అందించలేని పరిస్థితి ఎదురవుతోంది. బెడ్లు, ఫ్లోరింగ్, మెట్లు ఎక్కే పరిస్థితి కష్టంగా ఉంటోంది. 

ఈ నేపథ్యంలో ఆస్పత్రిలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లలోనే వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేసిన ఫోర్లు, బెడ్లు, చైర్లు ఇతర పరికరాలతో ఈ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే వృద్దుల్లో ఎక్కువగా జ్ఞాపక శక్తి సమస్యలు, పార్కిన్సన్స్, ఎముకల బలహీనత, కింద పడిపోవడం వంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఆయా జబ్బులకు చికిత్స అందించేలా డాక్టర్లు, సిబ్బందిని అందుబాటులోఉంచాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

వృద్ధులకు అవసరమైన ఫిజియోథెరపీ, న్యూట్రిషన్‌ కౌన్సెలింగ్, నర్సింగ్‌ కేర్‌ వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. వృద్ధుల ఆరోగ్యం విషయంలో నిరంతర పర్యవేక్షణ, సమయానికి మందులు అందించడం,రిహాబిలిటేషన్‌ సదుపాయాలు కల్పిస్తారు. 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు ప్రత్యేకఆదేశాలు ఇచ్చి, ఆయా ప్రాంతాల్లో క్లినిక్‌లకు వచ్చే వృద్ధుల్లో పైన పేర్కొన్న సమస్యలతో బాధపడేవారిని జిల్లా ఆస్పత్రుల్లోని జెరియాట్రిక్‌ వార్డులకు రిఫర్‌ చేసేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహఆదేశించారు.  

పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తాం: మంత్రి దామోదర
పేద, మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని మరింతగా పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యాధికారులను కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రామ్‌ ఆఫీసర్లతో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై మంత్రి సమీక్షించారు. 

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఇనిస్టిట్యూట్‌లో బుధవారం జరిగిన ఈ సమీక్షలో హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌కుమార్, డీహెచ్‌ రవీందర్‌నాయక్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ ప్రతి ఆస్పత్రిలోనూ అవసరమైన మేర డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బందిని నియమిస్తున్నట్టు తెలిపారు.ఐవీఎఫ్‌ సెంటర్లు, పెయిన్‌ క్లినిక్‌లు, రిహాబిలిటేషన్‌ సెంటర్ల పేరిట దోపిడీ, అవకతవకలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. కొన్ని జిల్లాల్లో సిజేరియన్‌ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని తగ్గించి నార్మల్‌ డెలివరీలను ప్రోత్సహించాలన్నారు.  

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి 
మారుతున్న జీవన శైలిలో భాగంగా ఉద్యోగులంతా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సచివాలయ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏఐ బేస్డ్‌ మెగా కార్డియాక్‌ హెల్త్‌క్యాంపును రెనోవా హాస్పిటల్స్‌ సౌజన్యంతో నిర్వహించారు. ఈ మెగా హెల్త్‌ క్యాంపును మంత్రి దామోదర ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికిఉందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement