కుట్టుపని అని చెప్పి.. క్యాట్‌వాక్‌ చేయించారు! | Former Women Maoists Ramp Walk Sparks Controversy Over Claims Of Lack Of Consent And Unpaid ₹10,000 Reward | Sakshi
Sakshi News home page

కుట్టుపని అని చెప్పి.. క్యాట్‌వాక్‌ చేయించారు!

Aug 18 2026 7:45 AM | Updated on Aug 18 2026 10:53 AM

Former female Maoists Ramp walk Incident

ర్యాంప్‌వాక్‌ ఇష్టపూర్తిగా జరిగింది కాదు

శిక్షణలో వారించినా మాపై కోప్పడ్డారు

వివరాలు వెల్లడించిన మాజీ మహిళా మావోయిస్టులు

ఇష్టపూర్తిగానే వెళ్లారంటున్న అధికారి

చీరతోపాటు పదివేలిచ్చామని వెల్లడి

చీరతప్ప డబ్బులివ్వలేదంటున్న మాజీలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ర్యాంప్‌వాక్‌ చేసిన మాజీ మహిళా మావోయిస్టులు’అంటూ కథనం మూడు రోజుల కిందట దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. నిన్నమొన్నటి వరకు నిర్బంధం నీడన తుపాకులు పట్టిన బస్తర్‌ ఆదివాసీ మహిళలు ఇప్పుడు స్వేచ్ఛగా, ధైర్యంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారంటూ ప్రభుత్వం పేర్కొంది. అయితే, ర్యాంప్‌వాక్‌ వెనుక జరిగిన తతంగం వేరే ఉందని ది వైర్‌–హిందీ వెబ్‌సైట్‌ ప్రచురించిన కథనం చెబుతోంది. ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్‌పూర్‌లో జరిగిన ర్యాంప్‌ వాక్, తెర వెనుక విషయాలను మాజీ మహిళా మావోయిస్టులు తమ వివరాలు గోప్యంగా ఉంచాలని కోరుతూ ‘ది వైర్‌’తో పంచుకున్నారని అందులో వెల్లడించారు

ముందు చెప్పలేదు...
లొంగిపోయాక ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని పోలీస్‌ క్యాంప్‌లో ఆశ్రయం పొందుతున్న మహిళా మావోయిస్టు లకు నైపుణ్య శిక్షణలో భాగంగా జగ్‌దల్‌పూర్‌లో కుట్టుపని(టైలరింగ్‌) నేర్పిస్తామని అధికారులు చెప్పారు. ఆ తర్వాత వారిని జగ్‌దల్‌పూర్‌కు కాకుండా రాయ్‌పూర్‌ తీసుకెళ్లారు. ఈ బృందంలోని ఇద్దరు మహిళా పోలీసు అధికారులు, 9 మంది మాజీ మహిళా మావోయిస్టులకు హోటల్‌లో మకాం ఏర్పాటు చేశారు. ముంబై నుంచి వచ్చిన నిపుణులతో ర్యాంప్‌వాక్‌ శిక్షణ ఇప్పించారు. ఈక్రమాన మెళకువలు ఒడిసిపట్టుకోవడంలో బెరుకుతనం చూపగా శిక్షకులు కోప్పడ్డారు. అయితే, కుట్టుపని అని చెప్పి తమకు కొత్త విషయం నేర్పిస్తుండటంతో తికమక పడగా, తమతో వచ్చిన మహిళా పోలీసులను ప్రశ్నించినా సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. చివరకు అస్పష్టతల నడుమే ర్యాంప్‌వాక్‌ కార్యక్రమం పూర్తయింది. ఫ్యాషన్‌షో– ర్యాంప్‌వాక్‌ అనే విషయం ముందే తెలిస్తే మేము వెళ్లేవాళ్లం కాదని వారు చెప్పినట్లు కథనంలో పేర్కొన్నారు.

వారి అనుమతితోనే..
సుక్మా జిల్లా గ్రామీణ పరిశ్రమల శాఖ అధికారి ‘ది వైర్‌’తో మాట్లాడుతూ.. ‘మాజీ మహిళా మావోయిస్టులు ఇష్టపూర్తిగానే ర్యాంప్‌వాక్‌ కార్యక్రమానికి వెళ్లారు. ఈమేరకు నిరభ్యంతర పత్రంపై సంతకాలు చేశారు. వారికి ఒక పట్టు చీరతో పాటు రూ.10 వేలు బహుమతిగా అందచేశాం’అని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై మాజీలు స్పందిస్తూ.. ‘తమకు గోండీ తప్ప మరో భాష రాదు, హిందీలో రాసిన పత్రంపై సంతకం చేయమంటే చేశాం. మాకు కేవలం ఒక చీర బహుమతిగా అందించారు. రూ.10 వేలు ఇవ్వలేదు’అని చెప్పారు. దీనిపై మళ్లీ సదరు ప్రభుత్వ అధికారిని వివరణ అడిగితే.. ‘రూ.10 వేల బహుమతిని మాజీల చేతికి ఇవ్వకుండా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం’అని చెప్పారు. ఈ వివరణపై మాజీలు స్పందిస్తూ ‘కార్యక్రమం పూర్తయ్యాక ఒక చీర ఉన్న సంచి మాకు ఇచ్చారు. మా ఖాతాల్లో ఎలాంటి నగదు జమ కాలేదు’అని చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మాజీ మహిళా మావోయిస్టుల ర్యాంప్‌వాక్‌ అంశం ఇప్పుడు కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement