breaking news
Female Maoists
-
కుట్టుపని అని చెప్పి.. క్యాట్‌వాక్ చేయించారు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ర్యాంప్‌వాక్ చేసిన మాజీ మహిళా మావోయిస్టులు’అంటూ కథనం మూడు రోజుల కిందట దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. నిన్నమొన్నటి వరకు నిర్బంధం నీడన తుపాకులు పట్టిన బస్తర్ ఆదివాసీ మహిళలు ఇప్పుడు స్వేచ్ఛగా, ధైర్యంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారంటూ ప్రభుత్వం పేర్కొంది. అయితే, ర్యాంప్‌వాక్ వెనుక జరిగిన తతంగం వేరే ఉందని ది వైర్–హిందీ వెబ్సైట్ ప్రచురించిన కథనం చెబుతోంది. ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్‌పూర్‌లో జరిగిన ర్యాంప్ వాక్, తెర వెనుక విషయాలను మాజీ మహిళా మావోయిస్టులు తమ వివరాలు గోప్యంగా ఉంచాలని కోరుతూ ‘ది వైర్’తో పంచుకున్నారని అందులో వెల్లడించారుముందు చెప్పలేదు...లొంగిపోయాక ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని పోలీస్ క్యాంప్‌లో ఆశ్రయం పొందుతున్న మహిళా మావోయిస్టు లకు నైపుణ్య శిక్షణలో భాగంగా జగ్దల్పూర్లో కుట్టుపని(టైలరింగ్) నేర్పిస్తామని అధికారులు చెప్పారు. ఆ తర్వాత వారిని జగ్దల్పూర్కు కాకుండా రాయ్‌పూర్ తీసుకెళ్లారు. ఈ బృందంలోని ఇద్దరు మహిళా పోలీసు అధికారులు, 9 మంది మాజీ మహిళా మావోయిస్టులకు హోటల్లో మకాం ఏర్పాటు చేశారు. ముంబై నుంచి వచ్చిన నిపుణులతో ర్యాంప్‌వాక్ శిక్షణ ఇప్పించారు. ఈక్రమాన మెళకువలు ఒడిసిపట్టుకోవడంలో బెరుకుతనం చూపగా శిక్షకులు కోప్పడ్డారు. అయితే, కుట్టుపని అని చెప్పి తమకు కొత్త విషయం నేర్పిస్తుండటంతో తికమక పడగా, తమతో వచ్చిన మహిళా పోలీసులను ప్రశ్నించినా సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. చివరకు అస్పష్టతల నడుమే ర్యాంప్‌వాక్ కార్యక్రమం పూర్తయింది. ఫ్యాషన్‌షో– ర్యాంప్‌వాక్ అనే విషయం ముందే తెలిస్తే మేము వెళ్లేవాళ్లం కాదని వారు చెప్పినట్లు కథనంలో పేర్కొన్నారు.వారి అనుమతితోనే..సుక్మా జిల్లా గ్రామీణ పరిశ్రమల శాఖ అధికారి ‘ది వైర్’తో మాట్లాడుతూ.. ‘మాజీ మహిళా మావోయిస్టులు ఇష్టపూర్తిగానే ర్యాంప్‌వాక్ కార్యక్రమానికి వెళ్లారు. ఈమేరకు నిరభ్యంతర పత్రంపై సంతకాలు చేశారు. వారికి ఒక పట్టు చీరతో పాటు రూ.10 వేలు బహుమతిగా అందచేశాం’అని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై మాజీలు స్పందిస్తూ.. ‘తమకు గోండీ తప్ప మరో భాష రాదు, హిందీలో రాసిన పత్రంపై సంతకం చేయమంటే చేశాం. మాకు కేవలం ఒక చీర బహుమతిగా అందించారు. రూ.10 వేలు ఇవ్వలేదు’అని చెప్పారు. దీనిపై మళ్లీ సదరు ప్రభుత్వ అధికారిని వివరణ అడిగితే.. ‘రూ.10 వేల బహుమతిని మాజీల చేతికి ఇవ్వకుండా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం’అని చెప్పారు. ఈ వివరణపై మాజీలు స్పందిస్తూ ‘కార్యక్రమం పూర్తయ్యాక ఒక చీర ఉన్న సంచి మాకు ఇచ్చారు. మా ఖాతాల్లో ఎలాంటి నగదు జమ కాలేదు’అని చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మాజీ మహిళా మావోయిస్టుల ర్యాంప్‌వాక్ అంశం ఇప్పుడు కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. -
ఆమే కీలకం!
- దండకారణ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న మహిళా మావోయిస్టులు - ప్రచారస్థాయి నుంచి కమాండర్ల స్థాయికి ఎదుగుదల - రెక్కీ నిర్వహించడంలో కీలకపాత్ర చింతూరు (రంపచోడవరం): మావోయిస్టు ఉద్యమంలో సానుభూతిపరులుగా ఉంటూ ‘చేతన నాట్య మండలి’ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులు చేసే బాధ్యతలు నిర్వహించే మహిళలే నేడు మావోయిస్టుల కార్యకలాపాల్లో ఆరితేరిపోయారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బుర్కాపాల్ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు ఉదాహరణని కూంబింగ్‌లో పాల్గొన్న జవాన్లు చెబుతున్నారు. గతంలో బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ అగ్రనాయకులపై జరిగిన దాడిలోనూ వీరు అధికంగా పాల్గొన్నారు. ప్రస్తుతం దండకారణ్య పరిధిలోని ఆంధ్రా, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌లలో మహిళా కమాండర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు. ఇటీవలే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ముగ్గురు మహిళా మావోయిస్టు కమాండర్లపై భారీ రివార్డులు కూడా ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లాలోని విలీన మండలాల్లో శబరి ఏరియా కమిటీకి సైతం మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ భార్య శారద అలియాస్ సమ్మక్క సారథ్యం వహిస్తున్నారు. రెక్కీలో కీలకం... ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రేంజ్‌లోని ఏడు జిల్లాలతోపాటు తెలంగాణలోని భద్రాద్రి, ఆంధ్రాలోని తూర్పు గోదా వరి జిల్లాలను కలుపుకుని దండకారణ్యం విస్తరించి ఉంది. ప్రస్తుతం దండకారణ్య పరిధిలో భారీస్థాయిలో మహిళా మావోయిస్టుల రిక్రూట్మెంట్ జరిగి నట్లు నిఘావర్గాలు చెబుతున్నాయి. వీరికి రహస్య ప్రాంతాల్లో ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంటున్నాయి. గ్రామీణుల వేషధారణలో పోలీసు బలగాల క్యాంపుల అతి సమీపం వరకు వెళ్లి రెక్కీ నిర్వహించి బలగాల కదలికలను పసిగట్టే అవకాశముండడంతో వీరికే ఆ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో చురుకుగా వ్యవహరిస్తున్న చర్ల, శబరి ఏరియా కమిటీతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని దర్బా, భెజ్జీ, పర్శేగఢ్, కుట్రు, ఛోటేడోంగర్, ఝారాఘాటీ, ఆవపల్లి, ఆమాబేడా, ఓర్ఛా వంటి ఏరియా కమిటీల బాధ్యతను మహిళా కమాండర్లే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక శిక్షణ... ప్రతి ఇంటినుంచి ఓ మహిళ దళంలో చేరాలని ఇప్పటికే మావోయిస్టులు దండకారణ్య పరిధిలో హుకుం జారీ చేశారు. దళాల్లో చేరిన మహిళలకు యుద్ధ తంత్రంపై రహస్య ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. వీరిని భారీస్థాయిలో రిక్రూట్మెంట్ చేసి కీలక బాధ్యతలు అప్పగించి బలగాలపై దాడులు నిర్వహించేలా శిక్షణ ఇస్తున్నట్లు ఎన్కౌంటర్ల సమయంలో పోలీసులకు లభించిన డైరీల్లో ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. మరోవైపు బస్తర్ రేంజ్ పరిధిలోని జైళ్లలో సుమారు 50 మంది మహిళా మావోయిస్టుల ఖైదీలుగా ఉన్నట్లు సమాచారం.


