ఖమ్మం స్పోర్ట్స్: హనుమకొండలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని జిల్లా క్రీడాకారులు 31 పతకాలను సాధించారు. ఇందులో 14 బంగారు, ఎనిమిది రజిత, తొమ్మిది కాంస్య పతకాలు సాధించారు. అలాగే, మహిళల విభాగంలో ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ.గౌస్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మందుల వెంకటేశ్వర్లు తదితరులు శుక్రవారం అభినందించారు.
జాతీయ స్థాయి టీ.టీ. టోర్నీకి ముగ్గురు..
జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. అండర్–17 బాలుర విభాగంలో పి.జ్వలిత్, అండర్–13లో బి.తన్మైశ్రీ, అండర్–11లో హారాకా లక్ష్మి ఎంపిక కాగా, పంచకులలో ఈనెల 6నుంచి జరిగే పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొననున్నారు. క్రీడాకారులను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వీవీఎస్.మూర్తి అభినందించారు.


