ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, అర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తూ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ విమర్శించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు, అఖిలపక్ష నాయకులతో కలిసి మాట్లాడారు. ఈసీ, మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈనెల 3, 4వ తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, 5, 6, 7వ తేదీల్లోవీసీ తీరును కరపత్రాల ద్వారా వివరిస్తామని తెలిపారు. అలాగే, 8వ తేదీన ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దీపక్ చౌదరి, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, న్యూడెమోక్రసీ, మాస్‌లైన్, టీజేఎస్, ఆప్ నాయకులతో పాటు సీసీఐ బాధ్యులు ఆవునూరి మధు, ఆవుల అశోక్, గోపగాని శంకర్, ఎన్.తిరుమలరావు, రవిమారుత్, బాబు పాల్గొన్నారు.
● తొలుత కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ జయంతి ఆయన చిత్రపటం వద్ద పార్టీ నాయకులు నివాళులర్పించారు. అలాగే, గాంధీచౌక్‌లో గాంధీ విగ్రహం వద్ద కూడా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు సత్యనారాయణ దీపక్‌చౌదరి, సుడా, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖాదర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు నాయకులు దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ


