కేసీఆర్‌ ‘కాళేశ్వరం’ కసరత్తు | Former Cm KCR Focus to appear before Justice Ghosh Commission | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ‘కాళేశ్వరం’ కసరత్తు

May 29 2025 1:29 AM | Updated on May 29 2025 5:56 AM

Former Cm KCR Focus to appear before Justice Ghosh Commission

జూన్‌ 5న విచారణ కమిషన్‌ ముందుకు బీఆర్‌ఎస్‌ అధినేత

సాక్షి, హైదరాబాద్‌:  కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు జూన్‌ 5న హాజరు కావాలని నిర్ణయించుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. ఆ మేరకు కసరత్తు ప్రారంభించారు. బుధవారం కేసీఆర్‌ ఎర్రవల్లి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. మరో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

జూన్‌ 5న కేసీఆర్, 9న హరీశ్‌రావు కమిషన్‌ ముందు హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ వినిపించాల్సిన వాదనలు, ఇవ్వాల్సిన వివరణపై వారు చర్చించినట్లు సమాచారం. కమిషన్‌ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణ తీరుతెన్నులను కేసీఆర్‌ సమీక్షించినట్లు తెలిసింది. 

కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అందులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు క్రోడీకరించి నివేదిక సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి కొందరు సాగునీటి రంగ నిపుణులు, సాంకేతిక నిపుణుల నుంచి కూడా వివరాలు కోరినట్లు తెలిసింది.  

ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో లోపాలపైనా చర్చ 
నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదిక అశాస్త్రీయంగా ఉందని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ చేసిన ప్రకటనపైనా ఈ భేటీలో లోతుగా చర్చించినట్లు తెలిసింది. ఎన్‌డీఎస్‌ఏ నివేదికలోని డొల్లతనాన్ని కమిషన్‌ ఎదుట ప్రస్తావించాలని నిర్ణయించినట్లు సమాచారం. 

కమిషన్‌కు అరకొర సమాచారం ఇవ్వకుండా పూర్తి స్థాయి ఆధారాలతో వివరణ ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి గోదావరి నదుల విషయంలో పాలకులు చూపిన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపాలని భావిస్తున్నట్లు తెలిసింది. 

కాగా తాము అన్ని విషయాలు వివరించేందుకు వీలుగా తగినంత సమయం ఇవ్వాలని కూడా కమిషన్‌ను కోరాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. రాజకీయ దురుద్దేశంతో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేశారని మొదట్నుంచీ పేర్కొంటున్న నేపథ్యంలో.. తమ వాదన వినిపించేందుకు తగినంత సమయం ఇవ్వకపోతే అనుసరించాల్సిన వైఖరిపైనా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. 

నేడో రేపో పీపీ ప్రజెంటేషన్‌! 
విచారణ కమిషన్‌ ఎదుట హాజరవడానికి ముందే మీడియాకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలు, స్థితిగతులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని హరీశ్‌రావును కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించే పనిలో హరీశ్‌ ఉన్నట్లు సమాచారం. కాగా ఒకటీ రెండు రోజుల్లోనే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు సంబంధించిన తేదీని బీఆర్‌ఎస్‌ ప్రకటించే అవకాశముంది.   

Advertisement
 
Advertisement
Advertisement