బాయిల్డ్‌ రైస్‌ సేకరణకు ఎఫ్‌సీఐ మంగళం!

Food Corporation Of India Wont Collects Boiled Rice In Telangana - Sakshi

ఈ సీజన్‌లో 50 శాతానికి మించి తీసుకోలేమంటూ షరతులు 

ఎఫ్‌సీఐ అధికారులతో చర్చించి 80 శాతం తీసుకునేలా ఒప్పించిన సీఎం కేసీఆర్‌ 

సన్నరకాల సాగుకే ప్రాధాన్యమివ్వాలన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో అధికంగా ఉత్పత్తి అయ్యే బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం)సేకరణకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) క్రమంగా మంగళం పాడనుంది. ఒక్కసారిగా కాకుండా క్రమంగా బాయిల్డ్‌ రైస్‌ తీసుకునే విధానానికి స్వస్తి పలికేలా ఎత్తులు వేస్తోంది. గతేడాది వరకు రాష్ట్రం నుంచి భారీగా బాయిల్డ్‌ రైస్‌ సేకరించి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసిన ఎఫ్‌సీఐ.. ఈ ఏడాది యాసంగికి సంబంధించి 50 శాతానికి మించి బాయిల్డ్‌ రైస్‌ తీసుకోలేమని రాష్ట్రానికి స్పష్టం చేసింది. అయితే ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో భారీగా సాగైన దొడ్డు రకాల ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రం దృష్టికి అంశాన్ని తీసుకెళ్లడంతో పాటు, ఎఫ్‌సీఐని ఒప్పించడంతో ఈ సీజన్‌లో 80 శాతం బాయిల్డ్‌ రైస్‌ తీసుకునేందుకు అంగీకరించింది.

సాధారణంగా యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వీటికి అధికంగా డిమాండ్‌ ఉండటంతో ఈ బియ్యాన్ని రాష్ట్రం నుంచి సేకరించి ఆయా రాష్ట్రాలకు సరఫరా చేసేది. అయితే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లోనే పంటల దిగుబడి పెరిగి బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తి పెరిగింది. ఈ నేపథ్యంలో తమకున్న డిమాండ్‌ మేరకు రా రైస్‌ (ముడి బియ్యం) మాత్రమే కావాలని, బాయిల్డ్‌ రైస్‌ తీసుకోవద్దని నిర్ణయించింది. అయితే తర్వాత ఎఫ్‌సీఐ 50 శాతం మేర మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ సీజన్‌లో మాత్రం 80 శాతం బాయిల్‌ రైస్, 20 శాతం రా రైస్‌ తీసుకోవడానికి అంగీకరించింది.

కాగా, బాయిల్డ్‌ రైస్‌ సేకరణ నుంచి ఎఫ్‌సీఐ క్రమంగా తప్పుకొంటున్న నేపథ్యంలో దొడ్డు బియ్యం సాగు నుంచి రైతులు బయటకు రావాలని, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న సన్న రకం ధాన్యాల సాగుకు ముందుకు రావాలని పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. సన్న వడ్లతో పాటు వేరు శనగ, ఆయిల్‌ సీడ్‌ పంటల సాగుకు మళ్లాలని పేర్కొన్నారు. 

24 గంటల్లోనే ధాన్యం డబ్బులు.. 
రాష్ట్రంలో ఈ ఏడాది 6,575 కేంద్రాల ద్వారా 80 నుంచి 90 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం సేకరణ చేయనున్నట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 179 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు కావల్సిన రూ.20 వేల కోట్లను పౌరసరఫరాల సంస్థకు ముఖ్యమంత్రి సమకూర్చారని, 24 గంటల్లోనే రైతులకు తమ ఖాతాల్లో డబ్బులు పడేలా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా తేమశాతం 17 లోపు ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాసంగిలో 80 నుంచి 90 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోళ్లను కలిపి 2020–21 ఏడాదిలో 1.28 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ ఉంటుందన్నారు.    

చదవండి: భారీగా పెరిగిన డీఏపీ ధరలు..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top