సింగరేణిలో రెండు మూడు రోజుల్లో ప్లాంటు ప్రారంభం
ఏటా 9.1 లక్షల యూనిట్ల సోలార్ విద్యుత్ సద్వినియోగం.. రూ.70 లక్షలు ఆదా
సాక్షి, హైదరాబాద్: పగటిపూట ఉత్పత్తయ్యే సోలార్ పవర్‌లో వినియోగించని విద్యుత్తును ఉచితంగా గ్రిడ్‌కు సరఫరా చేయ కుండా, బ్యాటరీలో నిల్వ చేసుకొని, అవ సరమైనప్పుడు వాడుకునేలా ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్‌ఎస్)’ రాష్ట్రంలో తొలిసారిగా సింగరేణిలో ప్రారంభం కాబోతుంది. పునరుత్పాదక విద్యుత్తును పెంచే లక్ష్యంతో సింగరేణి సంస్థ మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కు అనుబంధంగా ఈ వ్యవస్థను ఇటీవల ఏర్పాటు చేసింది.
ఇది ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన ప్రయోగాత్మక ప్లాంట్. రెండు మూడు రోజుల్లో ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరాం తెలిపారు. సుమారు రూ.2.73 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థతో సింగరేణి సంస్థ ఏడాదికి 9.1 లక్షల యూనిట్ల సోలార్ విద్యుత్తును సద్వినియోగం చేసుకుంటూ రూ.70 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
బీఈఎస్‌ఎస్ ఎందుకంటే...
సింగరేణి సంస్థ ఇప్పటికే తన ఏరియాల్లో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఈ విద్యుత్తును తెలంగాణ ట్రాన్స్‌కో గ్రిడ్ ద్వారా అనుసంధానం చేసి సరఫరా చేస్తున్నారు. అయితే సింగరేణిలో డిమాండ్ లేని సమయాల్లో ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్‌ను గ్రిడ్‌కు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. తద్వారా సంస్థ నష్టపోతోంది.
ఇలా మిగిలిపోయిన సౌర విద్యుత్తును పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి బీఈఎస్‌ఎస్ ద్వారా నిల్వ చేస్తే... గరిష్ట విద్యుత్ వినియోగం ఉండే సమయంలో కంపెనీ అవసరాలకు ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 250 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది.


