రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం | Father And Daughter Diet In Road Accident At Nirmal | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం

May 12 2025 12:56 AM | Updated on May 12 2025 12:56 AM

Father And Daughter Diet In Road Accident At Nirmal

ఆగి ఉన్న వాహనాన్నిఢీకొనడంతో ఘటన

నిర్మల్‌/ఆదిలాబాద్‌టౌన్‌: ఆగి ఉన్న వాహనాన్ని కారు ఢీకొట్టగా తండ్రీకూతురు మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లాలో చోటు చేసుకుంది.  మాతృదినోత్సవం రోజున తల్లికి గర్భశోకంతోపాటు సౌభాగ్యమూ దూరం చేసింది. తనతో కలిసి పుట్టిన కవల సోదరిని ఒంటరి చేసింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తండ్రీకూతురు శంకర్‌(50), కృతిక(20) హైదరాబాద్‌ నుంచి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సొంతూరైన ఆదిలాబాద్‌కు కారులో బయల్దేరారు. నిర్మల్‌ రూరల్‌ మండలం నీలాయిపేట సమీపంలో ఎన్‌హెచ్‌–44 బైపాస్‌ రోడ్డు వద్దకు ఆదివారం వేకువజామున చేరుకున్నారు.

ఈ క్రమంలో రోడ్డుపై ఎలాంటి సూచికలు లేకుండా నిలిపి ఉంచిన ఐషర్‌ వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శంకర్, కృతిక తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి 108లో నిర్మల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. డ్రైవర్‌ విలాస్‌ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మహారాష్ట్రలోని యవత్మాల్‌ ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. ఘటన జరిగిన సమయంలో విలాస్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా, ముందు సీట్లో శంకర్, వెనుక సీట్లో కతిక ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు డ్రైవర్‌ ఐషర్‌ వాహనాన్ని నిలిపినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు నిర్మల్‌ రూరల్‌ ఎస్సై లింబాద్రి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement