
కూపన్ల కోసం పెద్దసంఖ్యలో రావడంతో నెలకొన్న తోపులాట
కారేపల్లిలో రెండు చోట్ల వేలాదిగా బారులు
తోపులాటలో సొమ్మసిల్లిన ఏఓ
అడవిదేవులపల్లిలో యూరియా తోపులాటలో గాయపడిన మహిళ మృతి
కారేపల్లి/అడవిదేవులపల్లి: ఒక్క బస్తా యూరియా దక్కించుకునేలా కూపన్ కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీకి 890 బస్తాల యూరియా రాగా, శుక్రవారం కూపన్లు జారీ చేస్తున్నారనే సమాచారంతో మహిళలు సహా పెద్దసంఖ్యలో రైతులు వచ్చారు. కారేపల్లి ఎస్సై బి.గోపి, ఏఓ భట్టు అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో రైతులను నియంత్రించేందుకు శ్రమ పడాల్సి వచి్చంది. రైతుల ఉరుకులు పరుగులు, తోపులాటలో ఒకరిపై ఒకరు పడగా, కొందరు వాహనాలపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి.
తొక్కిసలాటలో ఏఓ అశోక్‌కుమార్ కూడా సొమ్మసిల్లడంతో కారేపల్లి పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చివరకు కూపన్లను జిన్నింగ్ మిల్లులో ఇస్తామని చెప్పడంతో రైతులు అక్కడికి పరుగులు తీశారు. అక్కడికీ వేలాదిగా చేరడంతో అదే పరిస్థితి ఎదురైంది. కొందరు రైతులు కూపన్ల కోసం ఎగబడటంతో హోంగార్డు శంకర్ ఉక్కిరిబిక్కిరై కారేపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి తలదాచుకున్నాడు. ఈక్రమంలో 2,152 కూపన్లను రైతులకు అందజేయగా, మరో 1,600 మంది ఆందోళనకు దిగడంతో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అక్కడికి చేరుకుని నచ్చచెప్పారు. ఆపై అందరి పేర్లు నమోదు చేసుకుని 1,600 మంది రైతులకు ఇళ్ల వద్దే శనివారం నుంచి కూపన్లు ఇస్తామని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు.
11న తోపులాటలో గాయపడ్డ మహిళ మృతి
నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం జరిగిన తోపులాటలో గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. గోన్యాతండాకు చెందిన పాతులోతు దసి (52) ఈనెల 11న రైతు వేదిక వద్దకు యూరియా కోసం వచ్చి క్యూలో నిలబడింది. ఈ సందర్భంగా రైతుల మధ్య జరిగిన తోపులాటలో క్యూలో ఉన్న దసి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. తోటి రైతులు ఆమెను ఆటోలో మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.