నేను డీఎస్పీని..పదండి పోలీస్‌స్టేషన్‌కు.. | fake police kidding in hyderabad | Sakshi
Sakshi News home page

నేను డీఎస్పీని..పదండి పోలీస్‌స్టేషన్‌కు..

Apr 5 2025 7:41 AM | Updated on Apr 5 2025 7:41 AM

fake police kidding in hyderabad

హైదరాబాద్‌: నంబర్‌ ప్లేట్‌ లేని కారుకు పోలీస్‌ స్టిక్కర్‌ తగిలించుకుని వెళ్లిన ఆగంతకులు గదిలో ఉన్న ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన యువకులను కిడ్నాప్‌ చేసి అచ్చంపేటకు తీసుకువెళ్లి చితకబాదిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కడప జిల్లాకు చెందిన భూమిరెడ్డి కిషోర్‌రెడ్డి టీవీ నటులు ఇంద్రాణి, మేఘనలకు పర్సనల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. టీవీ సీరియళ్లకు డ్రైవర్‌గా పనిచేస్తున్న సందీప్‌రెడ్డి, ఓ తెలుగు ఛానల్‌లో కాస్ట్యూమర్‌గా పనిచేస్తున్న పల్లె శివ ముగ్గురూ కలిసి  శ్రీకృష్ణానగర్‌లో అద్దెకు ఉంటున్నారు. అచ్చంపేట సమీపంలోని బీకే ఉప్పనూతల గ్రామానికి చెందిన శివ అదే గ్రామానికి చెందిన  యువతిని ప్రేమిస్తున్నాడు.

 ఇద్దరూ కలిసి నాలుగు రోజుల క్రితం పెద్దలకు చెప్పకుండా పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె సోదరుడు సోహెల్‌తో పాటు మరో ఇద్దరు యువకులు గురువారం రాత్రి కిషోర్‌రెడ్డి గదికి వచ్చారు. తాము  పోలీసులమని, శివ ఆచూకీ చెప్పాలని అతడిని చితకబాదారు. తమకు ఏమీ తెలియదని చెప్పినా వినిపించుకోకపోగా, తాము పోలీసులమంటూ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు పదండి అంటూ కిషోర్, సందీప్‌లను కారులో ఎక్కించుకుని తక్కుగూడకు తీసుకెళ్లి మళ్లీ కొట్టి, ఫోన్లు లాక్కున్నారు. అక్కడి నుంచి ఉప్పనూతల గ్రామానికి తీసుకెళ్లడంతో అప్పటికే అక్కడ అప్పటికే రెండు కార్లలో సిద్ధంగా ఉన్న మరో 10 మంది యువకులతో కలిసి వారిని మరోసారి తీవ్రంగా కొట్టారు. అనంతరం బాధితులను అచ్చంపేట పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. 

టీవీ నటి ఇంద్రాణికి కిషోర్‌ ఫోన్‌ చేసి చెప్పడంతో ఆమె జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించింది. బాధితులు కూడా అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విషయాన్ని చెప్పారు. జూబ్లీహిల్స్‌ పోలీసుల నగరానికి తిరిగి వచ్చిన కిషోర్, సందీప్‌ ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సోహెల్, ఇబ్బూతో పాటు ప్రియురాలి పెదనాన్న, వారి బంధుమిత్రులపై కేసు నమోదు చేశారు. కిషోర్, సందీప్‌లను కిడ్నాప్‌ చేసింది నకిలీ పోలీసులని తేల్చారు. అమ్మాయి అడ్రస్‌ కనుక్కునేందుకు వారిని కిడ్నాప్‌ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై  క్రిమినల్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement