నేను అట్ల అనలే, మహిళా అధికారిపై మంత్రి ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు

Errabelli Dayakar Rao Controversy Comments - Sakshi

పల్లెప్రగతి కార్యక్రమంలో మహిళా ఎంపీడీవోపై అనుచిత వ్యాఖ్యలు 

కమలాపూర్‌: మహిళా ఎంపీడీవోపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పల్లెప్రగతిలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో శుక్రవారం పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించిన అనంతరం జరిగిన గ్రామసభలో మాట్లాడుతూ.. ఉదయం గంటసేపు, సాయంత్రం గంటసేపు తిరిగేలా పల్లెప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దాలని, మళ్లీ నెల తర్వాత వస్తానని, అప్పటివరకు ఇంకా అందంగా తయారు చేయాలని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌కు సూచించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో ఉన్నారా అంటూ అడగడంతో ఆమె వచ్చి మంత్రి వెనకాల నిల్చోగానే ‘మేడం నువ్వయితే బాగానే ఊపుతున్నవు కానీ ఈడ ఊపుతలేవు’.. బాగానే పని చేస్తదిలే అంటూ వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి వ్యాఖ్యల వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మంత్రి స్థాయిలో ఉండి గ్రామసభలో అందరిముందు అవమానపరిచేలా మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
 
సంచలనం కోసమే వక్రీకరణ: ఎర్రబెల్లి

కమలాపూర్‌: ఉద్దేశపూర్వకంగా కొన్ని వర్గాలు సంచలనం కోసం ప్రయత్నిస్తున్నాయని, వక్రీకరించి వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదని, ఉద్యోగులు, అధికారులపై తనకు గౌరవం ఉందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.   ఎంపీడీవోపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివరణ ఇచ్చారు. ఆ మహళా అధికారి కుటుంబంతో తనకు ఉన్న సన్నిహిత సంబంధంతోనే బాగున్నవా బిడ్డా (కూతురు) అంటూ పలకరించానని తెలిపారు.

అనంతరం గ్రామంలో పారిశుధ్య నిర్వహణలో ఉన్న లోపాలు, పచ్చదనం పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాల అమలుపై ఆరా తీశానని, తెలంగాణ ఉచ్ఛరణలో భాగంగా మీరు బాగా ఉరికి (పరిగెత్తి) పని చేస్తున్నారని, ఇంకా అందరినీ ఉరికించి పని చేయించాలని ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. కానీ కొందరు దాన్ని వక్రీకరించి సోషల్‌ మీడియాలో దుష్పచారం చేస్తున్నారని, ఇది వాంఛనీయం కాదన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top