
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న ఉపఎన్నిక పర్యవేక్షణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆదివారం కేంద్ర పరిశీలకులను నియమించింది. దేశవ్యాప్తంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఎనిమిది రాష్ట్రాల్లో ఉపఎన్నికల కోసం మొత్తం 470 మంది సీనియర్ అధికారులను నియమించినట్టు కమిషన్ ప్రకటించింది.
ఈ పరిశీలకుల్లో 320 మంది ఐఏఎస్, 60 మంది ఐపీఎస్, 90 మంది ఐఆర్‌ఎస్,ఐఆర్‌ఏఎస్,ఐసీఏఎస్ తదితర సేవలకు చెందినవారని కమిషన్ వివరించింది. వీరు ఎన్నికల ప్రక్రియలో న్యాయం, పారదర్శకత, విశ్వసనీయతను నిర్ధారించడమే లక్ష్యంగా పర్యవేక్షిస్తారు.
ఎన్నికల సమయంలో చట్టం, శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలించేందుకు జనరల్, పోలీసు పరిశీలకులు వ్యవహరించగా, అభ్యర్థులు ఖర్చు చేసే ఎన్నికల వ్యయాన్ని గమనించేందుకు ఎక్స్పెండిచర్ పరిశీలకులను నియమించామని కమిషన్ తెలిపింది.
కేంద్ర పరిశీలకులు ఎన్నికల సంఘానికి “కళ్ళు– చెవులు”గా వ్యవహరిస్తారని, సమయానుకూలంగా నివేదికలు పంపుతారని కమిషన్ పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణతో పాటు ఓటర్ల అవగాహన, పాల్గొనటానికి కూడా వారు సహకరించనున్నారు.
జమ్మూ కశ్మీర్ (బడ్గామ్, నాగ్రోటా), రాజస్థాన్ (ఆంటా), ఝార్ఖండ్ (ఘాట్షిలా), పంజాబ్ (తర్న్ తారన్), మిజోరాం (డంపా), ఒడిశా (నుఅపాడా)లో జరగనున్న ఉపఎన్నికల్లో కూడా ఈ పరిశీలకులను నియమించినట్టు కమిషన్ ప్రకటించింది.