Cable Bridge: బర్త్‌ డే రోజే.. | Durgam Cheruvu Flyover Incident, Young Man Died After Losing Control And Hitting A Divider | Sakshi
Sakshi News home page

Cable Bridge: బర్త్‌ డే రోజే..

Aug 6 2025 10:54 AM | Updated on Aug 6 2025 11:24 AM

durgam cheruvu flyover incident

విషాదం నింపిన రోడ్డు ప్రమాదం..  

హైదరాబాద్‌: స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని హాస్టల్‌కు బైక్‌పై తిరిగి వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కేక్‌ కట్‌ చేసిన అరగంటకే యువకుడు మృత్యువాత పడ్డ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం ముక్కురాళ్ల గ్రామానికి చెందిన ఎర్రగొల్ల అనిల్‌ (23) అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటూ సమీపంలో ఉన్న మైండ్‌ మ్యాప్స్‌ వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోస్‌లో ఎడిటింగ్‌ పనిచేస్తుంటాడు. మంగళవారం పుట్టినరోజు కావడంతో అనిల్‌ తన స్నేహితులు జాన్‌పాల్, మహేష్‌ నాగరాజు, వెంకటేష్‌ భాను తదితరులతో కలిసి బైక్‌లపై సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జికి వెళ్లారు.

 తమతో పాటు తెచ్చుకున్న కేక్‌ను అనిల్‌ కట్‌ చేసిన అనంతరం స్నేహితులంతా అక్కడే సరదాగా గడిపి తెల్లవారుజామున 2 గంటల సమయంలో బయలుదేరారు. ఈ క్రమంలో జాన్‌పాల్‌ బైక్‌ నడుపుతుండగా అనిల్‌ వెనుక కూర్చొన్నాడు. మిగతా స్నేహితులంతా ఎవరి బైక్‌లపై వారు అనుసరించారు. అనిల్‌ ఎక్కిన బైక్‌ను జాన్‌పాల్‌ అధిక వేగంతో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–45 ఫ్లైఓవర్‌ వైపు దూసుకెళ్తుండగా మలుపు వద్ద బైక్‌ అదుపుతప్పింది. దీంతో అనిల్‌ కిందపడగా కొద్ది దూరం వరకు రోడ్డుపై రాసుకుంటూ వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ నడుపుతున్న జాన్‌పాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెనుక వస్తున్న స్నేహితులంతా తల పగిలి రక్తపు మడుగులో విలవిల్లాడుతున్న అనిల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పుట్టినరోజు కావడంతో అంతకు ఆరు గంటల ముందే వీరు హాస్టల్‌లోనే మద్యం సేవించినట్లు పోలీసుల అదుపులో ఉన్న జాన్‌పాల్‌ వెల్లడించారు.

 జాన్‌పాల్‌కు బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌ నిర్వహించగా మద్యం సేవించినట్లుగా నమోదైంది. అర్ధరాత్రి మద్యం మత్తులో అదుపుతప్పిన వేగంతో బైక్‌పై దూసుకెళ్తుండడంతో మలుపు వద్ద కంట్రోల్‌ చేయలేక డివైడర్‌ను ఢీకొట్టినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేబుల్‌ బ్రిడ్జి వద్ద నుంచి బయలుదేరే ముందు అనిల్‌ తన బర్త్‌ డే కేక్‌ను చేతిలో పట్టుకొని బైక్‌పై కూర్చోగా ఈ ప్రమాదంలో అనిల్‌ కిందపడ్డ తర్వాత కేక్‌ రోడ్డంతా చిందరవందరగా పడిపోయింది. బర్త్‌ డే రోజు ఈ ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల రోదనలకు అంతులేకుండాపోయింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు ప్రమాదానికి కారకుడైన జాన్‌పాల్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement