రూ. 200 కోట్లపైనే! | DSP Bheem Reddy illegal assets value above Rs 200 crores | Sakshi
Sakshi News home page

రూ. 200 కోట్లపైనే!

Jul 3 2026 2:33 AM | Updated on Jul 3 2026 2:33 AM

DSP Bheem Reddy illegal assets value above Rs 200 crores

డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమ ఆస్తుల విలువ ఇదీ.. 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు

ఏక కాలంలో 16 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ఏసీబీ  

కర్ణాటకలోని పలుచోట్ల, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాలు గుర్తింపు 

2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, 23 విదేశీ మద్యం సీసాలు స్వాధీనం  

బినామీల ఇళ్లలో సోదాల్లోనూ నగదు పట్టివేత  

సాక్షి, హైదరాబాద్‌/మణికొండ/జడ్చర్ల: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. డీజీపీ కార్యాలయంలోని పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్‌రెడ్డి నివాసంతోపాటు బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో నిర్వహించిన ఏసీబీ సోదాల్లో వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు పట్టుబడిన స్థిరాస్తులు, బంగారం, వెండి, నగదు, బ్యాంకు నిల్వలు కలిపి దాదాపు రూ.200కోట్లకుపైనే భీమ్‌రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దీంతో భీమ్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు లో భాగంగా నార్సింగి వేసెల్లా మెడోస్‌లోని భీమ్‌రెడ్డి నివాసంతో సహా మొత్తం 16 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ సెంట్రల్‌ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సింధు శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.  

డైరీలో బినామీల పేర్లు..  
గురువారంనాటి సోదాల్లో ఏసీబీ అధికారులు భీమ్‌రెడ్డి నివాసంలో ఒక డైరీని స్వాదీనం చేసుకున్నారు. అందులో భీమ్‌రెడ్డి రాసుకున్న బినామీ పేర్ల ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు మరింత వేగవంతం చేశారు. ఒక బినామీ నివాసంలో రూ.40 లక్షల నగదు సహా 16 ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ సోదాలు శుక్రవారం కూడా కొనసాగే అవకాశాలున్నాయి. సోదాల్లో భాగంగా భీమ్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు 23 విదేశీ మద్యం సీసాలను స్వాదీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం వీటిని ఎక్సైజ్‌శాఖ అధికారులకు అప్పగించారు. భీమ్‌రెడ్డి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కీలక పోలీస్‌ స్టేషన్లు, ఆయా డివిజన్లలో బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌హెచ్‌వో)గా, వనస్థలిపురం ఏసీపీగా, పటాన్‌చెరు డీఎస్పీగా పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలోని పలువురు నేతలకు భీమ్‌రెడ్డితో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వనస్థలిపురం, పటాన్‌చెరులో పోస్టింగ్స్‌ కోసం గతంలో పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పటాన్‌చెరుకు చెందిన ఓ నేతతో కలిసి పరిసర ప్రాంతాల్లో సివిల్‌ వివాదాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాల్లో అనేక అక్రమాలకు పాల్పడినట్లు భీమ్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి. 

సోదాల్లో ఏసీబీ గుర్తించిన ఆస్తులివే.. 
– ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా. 
– టెలికాం నగర్‌లో జీ+2 నివాస భవనం, పెంట్‌హౌస్‌.  
– టెలికాం నగర్‌లోని సాయి ప్రభ రెసిడెన్సిలో ఒకఫ్లాట్, గచ్చిబౌలిలోని కాంత్రి సియోన్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఒకఫ్లాట్‌. 
– మణికొండలోని ల్యాంకోహిల్స్‌ రోడ్డులో 500 చదరపు గజాలలో జీప్లస్‌ 5 కమర్షియల్‌ కాంప్లెక్స్‌.  
– మణికొండ మర్రిచెట్టు జంక్షన్‌ సమీపంలో వాణిజ్య సముదాయంలో వాటా, 3,000 చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌. 
– తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు. 
– ప్రగతి రిసార్ట్స్‌లో 500 గజాల నివాస స్థలం. 
– సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి. 
– కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూములు.. బెంగళూరులోని దేవనహళ్లి ప్రాంతంలో ఒక ఎకరం భూమి. 
– నాగోలులోని కామినేని ఆస్పత్రి సమీపంలో 200 గజాల్లో స్థలం.  
– జీపీఆర్‌ హౌసింగ్‌ సొసైటీలో 400 గజాల్లో స్థలం.  
– పటాన్‌చెరులో 200 గజాల్లో స్థలం. 
– వికారాబాద్‌ జిల్లా మొమిన్‌పేట్‌ ప్రాంతంలో వెయ్యి గజాల్లో స్థలంతోపాటు రెండు ఎకరాల వ్యవసాయ భూమి.  
– శ్రీ రాఘవేంద్ర రాక్‌ శాండ్‌ మినరల్స్‌ సంస్థలో రూ.75 లక్షల పెట్టుబడి.  
– రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ గ్రామంలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి. 

నగదు, బంగారం, వెండి స్వాదీనం 
సోదాల్లో భీమ్‌రెడ్డి నివాసంలో రూ.3.60 లక్షల నగదు, అదేవిధంగా సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, బ్యాంకు ఖాతాల్లో రూ.19.91 లక్షల నిల్వలను ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీ ఇంట్లో రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.  

స్వగ్రామం ఆలూరులోనూ సోదాలు 
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని డీఎస్పీ భీమ్‌రెడ్డి స్వగ్రామం ఆలూరులోని సొంత ఇంట్లోనూ గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూములకు సంబంధించి పాస్‌బుక్, రిజిస్టర్‌ డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. తండ్రి పేరు మీద ఉన్న భూమి వివరాలనూ సేకరించారు.  

మణికొండలోని స్నేహితుడి ఇంట్లోనూ.. 
మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్‌ చైర్మెన్‌ కె. నరేందర్‌రెడ్డి నివాసంలో భీమ్‌రెడ్డికి సంబంధించిన డబ్బు, ఆస్తుల పత్రాలుంటాయనే అనుమానంతో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. రాయదుర్గం సీఐగా భీమ్‌రెడ్డి పనిచేసినప్పటి నుంచి వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. భీమ్‌రెడ్డి ఓ ఆస్తిని నరేందర్‌రెడ్డిపై రిజిస్ట్రేషన్‌ చేసి తిరిగి దాన్ని రద్దు చేసుకున్న డాక్యుమెంట్‌ భీమ్‌రెడ్డి నివాసంలో లభించడంతో నరేందర్‌రెడ్డి నివాసంలోనూ సోదాలు చేసినట్లు సమాచారం. కాగా, నరేందర్‌రెడ్డి నివాసంలో భీమ్‌రెడ్డికి సంబధించి ఎలాంటి పత్రాలు లభించలేదని తెలిసింది. రూ. 5లక్షల నగదు, నరేందర్‌రెడ్డికే సంబంధించిన రెండు ఆస్తుల పత్రాలను పరిశీలించినట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement