ఆస్తి పంపకాల్లో తలెత్తిన వివాదంతో హత్యచేసిన భార్య
ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే
రిటైర్మెంట్ నామినీ పత్రాల్లో రెండో భార్య పేరు
కోపంతో రగిలిపోయిన మొదటి భార్య
హుస్నాబాద్: ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన వివాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నామినీ విష యంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఏకంగా భర్త ప్రాణాలనే బలితీసుకుంది. ఈ దారుణ ఘటన సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకుంది. హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్‌లో నివాసం ఉంటున్న కోటి వెంకటేశ్వర్లు (62) ఆసిఫాబాద్ జిల్లాలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ)గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య రాజమణి హుస్నాబాద్‌లో ఏఎన్‌ఎంగా పనిచేస్తుండగా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో భార్య భూమక్క గృహిణి కాగా ఈమెకు కూడా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కాగా వెంకటేశ్వర్లు ఈనెల 30న ఉద్యోగ విరమణ (రిటైర్మెంట్) కావాల్సి ఉంది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు, మొదటి భార్య రాజమణి మధ్య ఆస్తి విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్‌తో వచ్చే బెనిఫిట్ పత్రాల్లో నామినీగా రెండో భార్య పేరు పెట్టారని మొదటి భార్య రగిలిపోయింది. ఈ విషయంపై మాట్లాడుకునేందుకు హుస్నాబాద్‌లోని సొంత ఇంట్లో ఆదివారం పంచాయితీ పెట్టుకున్నారు.
భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో మొదటి భార్య సహనం కోల్పోయి ఇంట్లో ఉన్న రోకలి బండతో వెంకటేశ్వర్లు తల వెనుక భాగంలో కొట్టింది. దీంతో వెంకటేశ్వర్లు కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటేశ్వర్లు తమ్ముడి ఫిర్యాదు మేరకు రాజమణిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.


