breaking news
Property division
-
ఆస్తుల విభజనకు కమిటీని నియమించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనకు విశ్రాంత న్యాయమూర్తితో కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కేంద్రం అభిప్రాయం తెలుసుకున్న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. రూ.1.42 లక్షల కోట్ల విలువైన ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. గత విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చి ఐదు నెలలు గడిచినా తెలంగాణ ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించగలదా అని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నటరాజన్‌ను ధర్మాసనం అడిగింది. కౌంటరు ఎందుకు దాఖలు చేయలేదని తెలంగాణ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. నాలుగు వారాలు గడువు ఇవ్వాలని తెలంగాణ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఆస్తుల విభజన రాష్ట్ర విభజన చట్టంలోని అంశమని, రూ.1.42 లక్షల కోట్ల ఆస్తులను విభజించకపోవడం సరికాదని ఏపీ న్యాయవాది సింఘ్వి చెప్పారు. ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ నియమించినట్లు ఈ వ్యవహారంపైనా విశ్రాంత న్యాయమూర్తితో కమిటీని నియమించాలని కోరారు. ఆ విధంగా చేయొచ్చా అని నటరాజన్‌ను ధర్మాసనం ప్రశ్నించగా.. చేసే అవకాశం ఉందని ఆయన సమాధానమిచ్చారు. వాదనల అనంతరం నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ జూలై చివరి వారానికి వాయిదా వేసింది. -
ఇదే నా చివరి వీలునామా
లీగల్ కౌన్సెలింగ్ ‘నా’ అంటే ఎవరు? ‘చివరి’ వీలునామా అంటే ఏమిటి? వీలునామాను బాండ్ పేపర్లోనే రాయాలా? తెల్ల కాగితమైనా చెల్లుతుందా? కొట్టివేతలు, దిద్దుబాట్లు ఉండొచ్చా? ఇవే కాదు... వీలునామా రాసే ముందు, రాసేటప్పుడు, రాసిన తర్వాత కూడా... అనేక సందేహాలు తలెత్తుతాయి. వీటన్నిటికీ చట్టంలో స్పష్టమైన సమాధానాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే పేచీల ప్రశ్నే ఉండదు. నా వయసు 75. నాకు నలుగురు సంతానం. అందరి బాధ్యతలూ తీరిపోయాయి. అందరూ కలసి మెలసి ఉంటారు. నా తదనంతరం కూడా వారు ఇలాగే కలసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. నేనెటూ వయోవృద్ధుడిని కాబట్టి ఆస్తి విషయంలో వారి మధ్య ఎటువంటి పేచీలూ రాకుండా వీలునామా రాయాలనుకుంటున్నాను. అయితే ఎలా రాయాలో తెలియదు. అసలు వీలునామా ఎలా రాయాలి? దానికి ఉండే నియమ నిబంధనలు ఏమిటి? దయచేసి మీరు తెలియజేస్తే నాలాంటి వృద్ధులకు కనీస అవగాహన కల్పించిన వారవుతారు. - రాఘవరె డ్డి, నెల్లూరు సరియైన ఆస్తి విభజన జరగక కొన్ని అస్పష్టమైన వీలునామాల వల్ల అనేకమంది కోర్టులను ఆశ్రయించవలసి వస్తోంది. భారతీయ వారసత్వ చట్టం 1925 సెక్షన్ 2 (హెచ్) ప్రకారం వీలునామా కర్త అనగా వీలునామా రాసే వ్యక్తి తన ఆస్తిని తను మరణించిన తర్వాత ఏ విధంగా పంచాలో తెలుపుతూ రాసిన చట్టబద్ధమైన ప్రకటనను వీలునామా అనవచ్చు. స్థిమితమైన బుద్ధి కలిగి, మైనరుకాని వ్యక్తి తన ఆస్తిని పంచుతూ వీలునామా రాయొచ్చు. అనారోగ్యం వల్ల కాని, మత్తుమందులు సేవించి ఉన్నప్పుడు కాని, మరి ఏ ఇతర కారణాల వల్లనైనా తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నప్పుడు వీలునామా రాయకూడదు. చెవిటి, మూగ, గుడ్డి వారు కూడా వారేమి చేస్తున్నారో తెలుసుకోగలిగిన స్థితిలో ఉంటే వీలునామా రాయవచ్చు. వీలునామాలు అవి రాసిచ్చిన వ్యక్తి మరణానంతరమే అమలులోకి వస్తాయి. వీలునామా రాసే వారికి వారి జీవితకాలంలో దానిని రద్దు చేసుకునే అధికారం ఉంటుంది. వీలునామాలో మొదట వీలునామా రాసే వ్యక్తి పూర్తి పేరు, తండ్రి పేరు, వయసు, శాశ్వత చిరునామా, స్పష్టంగా రాయాలి. తరువాత సంతానం ఎంతమంది ఉన్నారు, వారి పేర్లు, వయసు, వృత్తి మొదలైనవి రాయాలి. తేలిక పదాలతో మాతృభాషలో ఏయే సంతానానికి ఎంతెంత ఆస్తి ఇస్తున్నారో రాయాలి. తనకున్న స్థిరాస్తులు, చరాస్తుల వివరాలు స్పష్టంగా రాయాలి. వీలునామాను తెల్లకాగితం పైన స్పష్టంగా రాసినా చెల్లుతుంది. వీలునామా రాసే వ్యక్తి వీలునామాలోని అన్ని పేజీలపైనా సంతకం చేయాలి. రాసేటప్పుడు దిద్దుబాట్లు లేదా కొట్టివేతలు దొర్లినప్పుడు అక్కడ చిన్న సంతకం చేయాలి. వీలునామాకు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సాక్షులు ఉండాలి. సాక్షి సంతకం చేసేవారు మేజర్లై, వీలునామా రాసిన వ్యక్తికన్నా చిన్నవారై ఉండాలి. పెద్దమనుషులు, విద్యావంతులు అయితే మంచిది. సంతకంతోపాటు సాక్షుల వయస్సు, వృత్తి, తండ్రిపేరు, చిరునామా రాయాలి. వీలునామా రాసేవారు అదే తమ చివరి వీలునామా అని ప్రకటించాలి. వీలునామాను రిజిస్టర్ చేయించడం తప్పనిసరి కానప్పటికీ, రిజిస్టర్ చేయించడం వల్ల భవిష్యత్తులో ఏమైనా వివాదాలు వస్తే, సాక్ష్యంగా పనికి వస్తుంది. వీలునామాను బ్యాంక్లాకర్లలో లేదా నమ్మకమైన లాయర్ల వద్ద దాచవచ్చు. లేదంటే కవర్లో ఉంచి, సీల్‌వేసి సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో డిపాజిట్ చేయవచ్చు. నా వయసు 20. రెండేళ్ల క్రితం నన్నొక అర బ్షేక్ వివాహం చేసుకున్నాడు. అతనికి దాదాపు 65 ఏళ్లుంటాయి. నా తలిదండ్రులు ఒక బ్రోకర్ మాయమాటలను నమ్మి, నాకు ఇష్టం లేకున్నా నిఖా జరిపించారు. ఈ సందర్భంగా బ్రోకర్ నా తల్లిదండ్రులకు కొంత డబ్బిచ్చి, నాతో ఒక అగ్రిమెంటుపై సంతకం చేయించుకున్నాడు. నా భర్త కేవలం నెలరోజులు మాత్రమే నాతో ఉన్నాడు. తర్వాత దుబాయ్ వెళ్లిపోయాడు. ఇంతవరకూ అతని నుంచి ఏ సమాచారమూ లేదు. వాకబు చేస్తే నాది మ్యూటా మ్యారేజ్ అంటారని, బ్రోకర్ డబ్బు తీసుకుని మా కుటుంబాన్ని మోసం చేశాడని తెలిసింది. మ్యూటా మ్యారేజ్ అంటే ఏమిటి? దయచేసి వివరాలు తెలియజేయగలరు. - రజియా, నల్గొండ కొందరు బ్రోకర్లు ఒక ముఠాగా ఏర్పడి పేదరికంలో ఉన్న తల్లిదండ్రులను ప్రలోభపెట్టి కొంత డబ్బు అప్పజెప్పి వారి ఆడపిల్లలకు వృద్ధులైన అరబ్ షేక్‌లతో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ప్రతిఫలంగా అరబ్‌షేక్‌ల నుండి కొంత డబ్బు తీసుకుంటారు. కొందరు త్వరలో దుబాయ్‌కి వెళ్లి, పేపర్లు పంపిస్తామని, అక్కడికి వారిని తీసుకెళ్తామని మోసపు మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు. మరికొందరు అమాయకులైన ఆడ పిల్లలను పెళ్లి చేసుకుని, దుబాయ్‌కి తీసుకొని వెళ్లి, అక్కడ వారి భార్యలకు పనివారిగా మార్చుతున్నారు. ఇంకొందరు జీతం భత్యం ఇవ్వకుండా చాకిరీ చేయించుకుంటున్నారు. చాలామంది అ్కడ ఉండలేక, ఇక్కడకు వచ్చేమార్గం తెలియక, అక్కడే మగ్గిపోతున్నారు. మీరు చేసుకున్న మ్యూటా మ్యారేజ్ అంటే తాత్కాలిక వివాహం అని అర్థం. విదేశాలనుండి సొంతపనుల మీదనో, వ్యాపారం కోసమో, టూర్ల కోసమో మన దేశానికి వచ్చే ధనికులైన అరబ్‌లు ఆ కాస్త సమయంలో తమ శారీరక అవసరాలు తీర్చుకునేందుకు చేసుకునే వివాహం అన్నమాట. దానికోసం కొంత డబ్బును మెహర్ రూపేణా చెల్లిస్తారు. వారు ఏర్పరచుకున్న కాలపరిమితి అయిపోగానే వివాహం రద్దవుతుంది. ఈ వివాహం వల్ల దంపతులిరువురికీ ఎలాంటి వారసత్వ హక్కులూ రావు. ఈ వివాహం చేసుకున్న యువతి మనోవర్తికి కూడా అర్హురాలు కాదు. ఒకవేళ సంతానం కలిగితే వారికి మాత్రం వారసత్వ హక్కులు ఉంటాయి. అయితే ఇటువంటి తాత్కాలిక వివాహాలు ఏర్పాటు చేసే బ్రోకర్లు, ఇటువంటి వివాహం చేసుకున్న వారు, పెళ్లి తతంగం జరిపించిన వారు గర్ల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద శిక్షార్హులవుతారు. మీరు మీకు దగ్గరలోని కోర్టును ఆశ్రయించండి. కొంత ఫలితం ఉంటుంది. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్