‘ముప్పై తారీఖు ఊళ్లె ఓట్లున్నయ్‌.. వచ్చి మన పార్టీకే ఓటు వేయాలే’ | Sakshi
Sakshi News home page

‘ముప్పై తారీఖు ఊళ్లె ఓట్లున్నయ్‌.. వచ్చి మన పార్టీకే ఓటు వేయాలే’

Published Tue, Nov 21 2023 10:16 AM

Digital payments In Telangana Elections - Sakshi

కరీంనగర్‌రూరల్‌: ‘అన్నా.. మంచిగున్నవానే.. ఈ ముప్పై తారీఖు ఊళ్లె ఓట్లున్నయ్‌.. గుర్తుంది కదా..? జరంత తప్పకుండా అందరూ రావాలే. వదినను కూడా తీసుకుని రండ్రి. అందరూ మనపార్టీకే ఓటు వేయాలే. మనోళ్లను గెలిపించుకోవాలే. ఎంత పనిఉన్నా కొంచెం పక్కనపెట్టుకుని     ముందే రావాలే. రానూపోను ఖర్చులు మేమే భరిస్తాం. అవసరమైతే ముందుగాలనే పేమెంట్‌ కొడతాం.. ఇంతకీ.. నీది ఫోన్‌పేనా..? గూగుల్‌ పేనా..? అన్నా..’ అంటూ.. జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లను సంప్రదిస్తున్నారు. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూ ర్‌ నియోజకవర్గాల నుంచి వివిధ ప్రాంతాల్లో ఉపాధి నిమిత్తం స్థిరపడిన వారిని సంప్రదిస్తూ.. ‘ఓట్ల’గాలం వేస్తున్నారు.

ప్రతీ ఒక్కరిని పలకరిస్తూ..
ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే.. ఒక్కో సందర్భంలో ఓటు తేడాతో గెలిచిన అభ్యర్థులు.. ఓడిన ఉద్ధండులూ ఉన్నారు. అందుకే ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతీ ఓటరును అభ్యర్థులు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం పొద్దున నిద్ర లేవగానే అందరి ‘టచ్‌’లోకి వెళ్తున్నారు. ఇందుకోసం ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తలు కొద్దిరోజులుగా కష్టపడుతున్నారు. వలస ఓటర్లు, కుల సమీకరణ, మహిళలు, పురుషులు, సంఘాలు.. స్నేహబంధాలు.. బంధుత్వాలు.. ఇలా ప్రతీ ఒక్కరిని పలుకరించి తమ అభ్యర్థికే ఓటు వేయాలని కోరుతున్నారు. స్థానికంగా ఉన్న ఓటర్లను ఏదోఒక సమయంలో నేరుగా కలుస్తూ.. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా.. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని ఫోన్‌లో సంప్రదిస్తున్నారు.

కార్యకర్తల ద్వారా ‘టచ్‌’లోకి.. 
జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల నుంచి వివిధ ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వలసవెళ్లినవారు వేలల్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలైన చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్‌లో ఈ వలస ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి వరంగల్, హైదరాబాద్, భీవండి, సూరత్‌ లాంటి పొరుగు ప్రాంతాలకు బతుకుదెరువు కోసం వెళ్లినవారు, బెంగళూరు,  పుణే, చెన్నైలాంటి సిటీల్లో ప్రయివేటు ఉద్యోగులుగా స్థిరపడిన వారు అనేకం. ఎన్నికల సందర్భంగా వారు స్వ స్థలానికి వచ్చి ఓటు వేస్తారో.. వేయరో అన్న భయం నేతల్లో నెలకొంది. ఈ క్రమంలో తమ కార్యకర్తల ద్వారా వారికి టచ్‌లోకి వెళ్తున్నారు.

అన్నా.. అక్కా అంటూ.. 
గ్రామాల్లో ఉన్నవారి నుంచి ఫోన్‌ నంబర్లు తీసుకుని, ఫోన్‌చేసి ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. అన్నా.. అక్కా అంటూ సంబోధిస్తూ.. ఓటేసేందుకు తప్పకుండా ఊరికి రావాలని కోరుతున్నారు. ఎన్నిపనులు ఉన్నా.. ఒక్కరోజు టైం ఇవ్వాలని కోరుతున్నారు. అవసరమైతే దారిఖర్చులు ఇస్తామని చెబుతున్నారు. నమ్మకం లేకుంటే.. ముందస్తుగానే పంపిస్తామని.. మీది ఫోన్‌పేనా..? గూగుల్‌ పేనా? అంటూ అడుగుతూ.. ఆన్‌లైన్‌ పేమెంట్లు చేసేస్తున్నారు. తమ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాల ని కోరుతున్నారు. ఇలా వలస ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న జిల్లాలోని వివిధ పార్టీల కార్యకర్తలు తమ అభ్యర్థులకు ఓటు బ్యాంకు పెంచే పనిలో నిమగ్నమవడం కనిపిస్తోంది. 

Advertisement
 
Advertisement