విమానమెక్కి.. శ్రీరాముణ్ణి మొక్కి! | Demand for helicopter and chartered flights to Ayodhya | Sakshi
Sakshi News home page

విమానమెక్కి.. శ్రీరాముణ్ణి మొక్కి!

Jan 15 2024 2:53 AM | Updated on Jan 15 2024 2:53 AM

Demand for helicopter and chartered flights to Ayodhya - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రామ భక్తులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు వెళ్లా­యి. దీంతో అయోధ్యకు వెళ్లే హెలికాప్టర్, చార్టర్డ్‌ విమానాలకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే ఈనెల 22న అయోధ్య విమానాశ్రయంలో 100 చార్టర్డ్‌ విమానాలు దిగుతాయని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తెలిపారు. లక్షమందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా.  

ఇప్పటికే క్యాబ్‌లు, రైళ్లు ఫుల్‌ 
ఇప్పటికే జనవరి 22 నాటికి రైల్వే టికెట్‌ బుకింగ్‌లు 60 శాతం మేర పెరిగాయి. అలాగే అయోధ్యలో క్యాబ్‌ ఆపరేటర్ల బుకింగ్‌లు 50 శాతం పెరుగుతాయని ట్రావెల్‌ పోర్టళ్ల అంచనా. ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థలు డిసెంబర్‌ 30 నుంచి దేశంలోని ప్రధాన మెట్రో నగరాల నుంచి అయోధ్యకు సాధారణ విమాన సేవలను ప్రారంభించాయి. ప్రస్తుతం అయోధ్యకు రోజుకు నాలుగు విమాన సర్విస్‌లు నడుస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఇది 20–24కు పెరుగుతుందని అయోధ్య విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే చార్టర్డ్‌ ఫ్లయిట్‌ ఆపరేటర్ల నుంచి 42 ఎంక్వయిరీలు వచ్చినట్లు చెప్పాయి. అయోధ్య విమానాశ్రయంలో విమానాల కోసం తగినంత పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో ఈనెల 22న ప్రైవేట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థలు ప్రయాణికులను పికప్, డ్రాప్‌ మా­త్రమే చేయాలని, విమానాలను లక్నో, వారణాసి, ఖుషీనగర్, పాటా్న, ఢిల్లీ వంటి పొరుగు విమానాశ్రయాల్లో పార్కింగ్‌ చేయాలని సూచించారు. 

మెట్రో నగరాల నుంచి డిమాండ్‌ 
మిలియన్‌ ఎయిర్, క్లబ్‌ వన్‌ ఎయిర్, ఎంఏబీ ఏవియేషన్, జెట్‌సెట్‌గో వంటి ప్రైవేట్‌ చార్టర్డ్‌ విమాన సంస్థలు అయోధ్యకు విమాన సేవలను అందిస్తున్నాయి. ఈ ఏడాది చార్టర్డ్‌ ఫ్లయిట్లు, హెలికాప్టర్లకు డిమాండ్‌ పెరిగిందని ఎయిర్‌ చార్టర్డ్‌ సంస్థ క్లబ్‌ వన్‌ ఎయిర్‌ సీఈఓ రాజన్‌ మెహ్రా తెలిపారు. తెలంగాణ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు, అహ్మదాబాద్‌లో వైబ్రంట్‌ గుజరాత్‌ ఇన్వెస్టర్‌ సమిట్‌లతో ప్రైవేట్‌ చార్టర్డ్‌ ఆపరేటర్లకు గిరాకీ పెరిగిందని తెలిపారు.

తాజాగా రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యకమంతో చార్టర్డ్‌ ఫ్లయిట్ల కోసం ఎంక్వయిరీలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే 12 సీట్ల జెట్‌ ఫాల్కన్‌ 2000 బుక్‌ అయిందని చెప్పారు. ఆలయ ప్రారంభోత్సవం రోజున చార్టర్డ్‌ విమానాల కోసం 25 ఎంక్వయిరీలు వచ్చాయని మరో ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ ప్రతినిధి తెలిపారు. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణే, నాగ్‌పూర్‌ వంటి మెట్రో నగరాల నుంచి అభ్యర్థనలు వచ్చాయని చెప్పారు. 

సీటింగ్‌ను బట్టి చార్జీలు 
విమానం సైజు, సీటింగ్‌ సామర్థ్యాన్ని బట్టి ఈ మార్గంలో ధర రూ.10–20 లక్షలు ఉంటుందని ప్రైవేట్‌ ఎయిర్‌క్రాప్ట్‌ కంపెనీలు తెలిపాయి. అయితే చలికాలం నేపథ్యంలో పొగమంచు, తక్కువ విజిబిలిటీ కారణంగా అయోధ్యకు విమాన సర్విసులు సవాలేనని, దీంతో అయోధ్యకు ప్రైవేట్‌ చార్టర్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల అనుమతులపై విమానాశ్రయ వర్గాల నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉందని తెలిపాయి. ప్రస్తుతం అయోధ్య విమానాశ్రయం రోజుకు 6 గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈనెల 22న ఆలయ ప్రారంబోత్సవం రోజున మాత్రం 24 గంటలు తెరిచి ఉండేలా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement