
హైదరాబాద్ రహదారులపై ఢిల్లీ బండ్లు రయ్ రయ్
అక్కడ కాల పరిమితి ముగిసిన వాహనాలకు ఇక్కడ గిరాకీ
నగరానికి తరలించి విక్రయిస్తున్న ఏజెంట్లు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ బండ్లు హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. అక్కడ కాలపరిమితి ముగిసిన వాహనాలు నగరంలో జోరుగా అమ్ముడవుతున్నాయి. తక్కువ ధరల్లో లభిస్తుండటంతో నగరవాసులు వెనుకడుగు వేయకుండా కొనుగోలు చేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ వాహనాలే అయినప్పటికీ కండీషన్ బాగా ఉన్నవి కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. సెకండ్ హ్యాండ్ వాహనాల దందా ఏజెంట్‌లకు లాభసాటిగా మారింది.
తక్కువ ధరలకు లభిస్తుండటంతో..
⇒ ఇటీవల ఢిల్లీ సర్కారు పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఆంక్షలను కఠినతరం చేసింది. కొద్ది రోజుల క్రితమే ఈ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ‘నో పెట్రోల్, నో డీజిల్’ అంటూ నిబంధనలు విధించింది. ప్రస్తుతం కొన్ని సాంకేతిక కారణాలతో ఈ నిబంధనను వాయిదా వేసినప్పటికీ ఢిల్లీలో వాహన కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినందువల్ల పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ వాహనాలకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో డిమాండ్ ఏర్పడింది.
⇒ మరోవైపు తక్కువ ధరలకు లభిస్తుండటంతో చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ ఈ క్రమంలో కొందరు ఏజెంట్‌లు సెకండ్ హ్యాండ్ వాహనాల ముసుగులో ఊరూపేరూ లేని వాహనాలను విక్రయించి భారీఎత్తున సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి డాక్యుమెంట్‌లు, ఆధారాలు లేని వాహనాలకు సైతం నగరంలోని కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో తప్పుడు అడ్రస్‌లపై రిజిస్ట్రేషన్‌ల పునరుద్ధరణ జరుగుతోంది. దీంతో అటు ఏజెంట్‌లకు, ఇటు కొందరు ఆర్టీఏ అధికారులకు ‘సెకండ్‌హ్యాండ్ బండి ఒక దందా’గా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.
డాక్యుమెంట్లు ఉంటే ఓకే..
⇒ ఒక రాష్ట్రంలో నమోదైన వాహనాలను మరో రాష్ట్రానికి తరలించేందుకు తప్పనిసరిగా రవాణాశాఖ అనుమతి అవసరం. వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, బీమా పత్రాలు, వాహన యజమాని చిరునామా ఉన్న వాటినే కొనుగోలు చేయాలి. అలా అన్ని డాక్యుమెంట్‌లు ఉన్నవాటికి మాత్రమే రవాణా అధికారులు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) అందజేస్తారు.దీంతో ఆ వాహనాన్ని ఎక్కడైనా విక్రయించవచ్చు. కానీ కొందరు ఏజెంట్‌లు ఎలాంటి ఎన్‌ఓసీలు లేకుండా దొంగబండ్లను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇలాంటి వాహనాలపై గతంలో పోలీసులు పలు కేసులు నమోదు చేసి నిందితులపైన చట్టపరమైన చర్యలు సైతం తీసుకున్నారు.
⇒ తాజాగా 15 ఏళ్లు ముగిసిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు ముగిసిన డీజిల్ వాహనాలపై ఢిల్లీ రవాణాశాఖ ఆంక్షలను విధించింది. ప్రస్తుతానికి ఈ ఆంక్షలను సడలించారు. ఇలాంటి వాహనాల వినియోగాన్ని మాత్రం ప్రభుత్వం నిరుత్సాహపరుస్తోంది. దీంతో చాలామంది వాహన యజమానులు వాటిని తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ బండ్లకు హైదరాబాద్‌లో మరోసారి గిరాకీ నెలకొంది. ఈ ముసుగులో కొందరు ఏజెంట్‌లు ఎలాంటి ఆధారాలు లేని వాహనాల విక్రయాలకు పాల్పడడం గమనార్హం.
‘వాహన్’లో నమోదు తప్పనిసరి..
గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతి రోజు సుమారు 3000లకు పైగా వాహనాలు కొత్తగా నమోదవుతాయి. వాటిలో 600 నుంచి 800 వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన సెకండ్ హ్యాండ్ వాహనాలే ఉన్నాయి. ప్రత్యేకించి సెకండ్ హ్యాండ్ కేటగిరీలో వ్యక్తిగత కార్ల కొనుగోళ్లు ఎక్కువ. ఈ కేటగిరీలో 70 శాతం కార్లు ఢిల్లీకి చెందినవే ఉన్నట్లు అంచనా. నగరంలో 15 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాల కాలపరిమితిని ప్రతి సంవత్సరం పొడిగించుకొనే అవ కాశం ఉంది. ఈ వెసులుబాటును దృష్టిలో ఉంచుకొని 5 నుంచి 10 ఏళ్ల లోపు కాల పరిమితి కలిగిన ఢిల్లీ వాహనాలను ఎక్కువగా కొను గోలు చేస్తున్నారు. ఎలాంటి వాహనాలైనా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘వాహన్’ వెబ్‌సైట్‌లో నమోదై ఉంటేనే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.