
ఎస్సీలకు రిజర్వుడైన జెడ్పీ చైర్మన్ పీఠం
ఆశలు పెట్టుకున్న నాయకులకు నిరుత్సాహం
చైర్‌పర్సన్ రేసులో మంత్రి దామోదర కూతురు త్రిష!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని ఆశించిన పలువురు నాయకుల ఆశలు ఆవిరయ్యాయి. రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో ఈ పదవిపై పెట్టుకున్న నాయకుల ఆశలు అడియాశలయ్యాయి. ఈ పదవి ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వు అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీ చేసిన గెజిట్‌లో సంగారెడ్డి జిల్లా ఎస్సీ జనరల్‌కు కేటాయించింది. దీంతో ఈ పదవిపై దృష్టి సారించిన ఇతర సామాజికవర్గాల నాయకులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రిజర్వేషన్ అనుకూలిస్తే బరిలోకి దిగాలని ఆయా నియోజకవర్గాల్లోని పలువురు నాయకులు భావించారు. మహిళకు రిజర్వు అయినా..వారి సతీమణితో పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీలు సైతం..
ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పలు నియోజకవర్గాల నాయకులకు ఈ జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పిస్తామని హామీలు ఇచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆయా అసెంబ్లీ స్థానాల ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన నాయకులను బుజ్జగించేందుకు ఈ పదవిని ఇస్తామని చెప్పారు. మరోవైపు ఆ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీ నుంచి తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కూడా ఈ పదవికి అవకాశం కల్పిస్తామని హామీలు గుప్పించారు. దీంతో ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల సంఖ్య పెరిగింది. తీరా ఇప్పుడు ఎస్సీ రిజర్వు కావడంతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
రెండు దశాబ్దాల తర్వాత ఎస్సీలకు అవకాశం
ఈ జెడ్పీ చైర్‌పర్సన్ పదవి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఎస్సీకి రిజర్వు అయింది. 2006– 2011 వరకు ఈ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ అయింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.బాలయ్య చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వు అయింది. టీఆర్‌ఎస్‌కు చెందిన ఎర్రగొల్ల రాజమణి ఈ పదవిలో కొనసాగారు. తర్వాత 2018– 2023 వరకు జనరల్ మహిళకు రిజర్వు కాగా..మంజుశ్రీరెడ్డి చైర్ పర్సన్‌గా ఉన్నారు. తాజాగా ఎస్సీ జనరల్‌కు రిజర్వు కావడంతో 20 ఏళ్ల తర్వాత ఈ సామాజికవర్గానికి అవకాశం దక్కినట్లయింది.
ఆ ఆరుగురికే అవకాశం!
జిల్లాలో మొత్తం 25 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాల్లో ఆరు మండలాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. దీంతో ఈ ఆరు మండలాల్లో జెడ్పీటీసీలుగా విజయం సాధించిన అభ్యర్థులకే జెడ్పీ చైర్మన్ పదవి వరించనుంది. ఎస్సీ రిజర్వు అయిన స్థానాల్లో పరిశీలిస్తే.. చౌటకూర్, మునిపల్లి, మనూరు, సంగారెడ్డి, కొండాపూర్, జహీరాబాద్ మండలాల జెడ్పీటీసీ స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. దీంతో ఈ మండలాల్లో గెలుపొందిన జెడ్పీటీసీలకే చైర్మన్ పదవి దక్కనుంది. దీంతో ఈ ఆరు మండలాల ఎన్నికలు ఫోకస్ కానున్నాయి.
రేసులో త్రిష రాజనర్సింహ?
జెడ్పీ చైర్‌పర్సన్ రేసులో మంత్రి దామోదర రాజనర్సింహ కూతురు త్రిష పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆమెను బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిష అందోల్ నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యహరించారు. తన తండ్రి విజయం సాధించడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. నియోజకవర్గం అంతా తిరుగుతూ దామోదర గెలుపునకు తనవంతు ప్రయత్నాలు చేశారు. ప్రధానంగా యువత, మహిళ ఓటర్లల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అందోల్ నియోజకవర్గం పరిధిలోని చౌటకూర్ జెడ్పీటీసీగా కానీ, మునిపల్లి జెడ్పీటీసీగా పోటీ చేస్తారనే చర్చ స్థానికంగా జరుగుతోంది.