
హైదరాబాద్: రాజేంద్రనగర్ బెంగుళూర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి యువ జంట హల్‌చల్ చేసింది. ద్విచక్ర వాహనంపై వెళుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను వెనుక వెళుతున్న ఓ వాహనదారుడు చిత్రీకరించి సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
దీంతో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్.రాజు తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆదివారం అర్ధరాత్రి బెంగుళూర్ జాతీయ రహదారి అయిన ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ ప్రాంతంలోని ప్‌లై ఓవర్ గుండా ద్విచక్ర వాహనంపై యువతీ, యువకుడు ఆరాంఘర్ చౌరస్తా మీదుగా మెహిదీపట్నం వైపు వెళ్లినట్లు గుర్తించారు. వాహన నంబర్ ఆధారంగా మోటార్ రవాణా చట్టం నిబంధన మేరకు ఫైన్ విధించారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ... వాహన నంబర్ ఆధారంగా సదరు యువకుడిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అతడిని స్టేషన్‌కు రప్పించి వాహనం ఎవరిది.. వాహనం నడిపిన యువకుడికి లైసెన్స్ ఉందా తదితర విషయాలను విచారించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.