సైడ్‌ఎఫెక్ట్స్ ‌చికిత్సకు 235 ఆసుపత్రులు రెడీ

Corona Vaccine Side Effects Treatment 235 Hospitals Ready - Sakshi

57-   ప్రభుత్వ ఆస్పత్రులు 

178- ప్రైవేటు ఆస్పత్రులు 

వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం 

మార్గదర్శకాలు జారీ 

రియాక్షన్‌ వచ్చిందంటే

తక్షణమే సమాచారం ఇవ్వాలి 

102,108 అత్యవసరనంబర్లకు ఫోన్‌ చేయాలి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా టీకా సమయంలో ఏవైనా సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తే తక్షణమే ఆసుపత్రులకు తరలించి... సత్వర వైద్యం అందించనున్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 235 ఆసుపత్రులను వైద్య ఆరోగ్యశాఖ ఎంపిక చేసింది. అందులో 57 ప్రభుత్వ ఆసుపత్రులు, 178 ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఏరియా ఆసుపత్రులను అందుకోసం ఎంపిక చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లో టీకా వేసుకున్నవారిలో ఎవరికైనా సీరియస్‌ సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తే వారిని తక్షణమే ఆయా ఆసుపత్రులకు తరలిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 329 పడకలను కరోనా టీకా సైడ్‌ఎఫెక్ట్స్‌ కేసుల కోసం కేటాయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక 178 ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో దాదాపు వెయ్యికి పైగా పడకలను వీటి కోసం ప్రత్యేకించినట్లు సమాచారం.

టీకాతో సంబంధం లేకుండా సైడ్‌ఎఫెక్ట్స్‌ రావొచ్చు 
ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికోసం పుణే నుంచి ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవిషీల్డ్‌ కరోనా టీకాలు మంగళవారం హైదరాబాద్‌ స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌కు చేరుకున్నాయి. వ్యాక్సిన్లను ముందుగా వైద్య సిబ్బందికి, ఆ తర్వాత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, అనంతరం 50 ఏళ్లు పైబడినవారు, ఆ లోపు వయస్సున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందజేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. జూన్‌ వరకు వీరందరికీ వేసేలా ప్రణాళిక రచించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,200 ఆసుపత్రులు, వాటిల్లోని 1,500 కేంద్రాల్లో కరోనా టీకా వేస్తారు. టీకాలు వేసిన అనంతరం రియాక్షన్లు వస్తే వైద్య చికిత్స అందజేస్తారు. సైడ్‌ఎఫెక్ట్స్‌ను సాధారణ, ఒక మోస్తరు తీవ్రమైన, అతి తీవ్రమైనవిగా వర్గీకరించిన సంగతి తెలిసిందే. టీకా వేసిన తర్వాత ఏదైనా తీవ్ర అనారోగ్య సంబంధమైన సమస్య లేదా సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తే వ్యాక్సిన్‌ వల్లే అనుకోవాల్సిన అవసరంలేదని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అప్పటికే ఏదైనా జబ్బు ఉండటం వల్ల కూడా రావొచ్చని పేర్కొంది.

మార్గదర్శకాల్లోని అంశాలు

  • సాధారణ సైడ్‌ఎఫెక్ట్స్‌లో నొప్పి, ఇంజెక్షన్‌ వేసిన చోట వాపు, జ్వరం, చిరాకు, అనారోగ్యం మొదలైనవి ఉంటాయి.  
  • తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్‌ ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చు. 102 డిగ్రీల వరకు అధిక జ్వరం రావొచ్చు.  
  • అతి తీవ్రమైన వాటిలో అనుకోకుండా ప్రాణం పోయే పరిస్థితి రావడం, మరణించడం జరగవచ్చు. అటువంటి వారిని వేగంగా ఆసుపత్రిలో చేర్పించాలి.  
  • పై మూడింటిలో ఏవైనా సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తే వెంటనే ఉన్నతస్థాయికి సమాచారం ఇవ్వాలి. కోవిన్‌ యాప్‌లో నమోదు చేయాలి.  
  • చిన్నపాటి దుష్ప్రభావాల నిర్వహణకు టీకా కేంద్రంలోనే మెడికల్‌ కిట్‌ ఉంటుంది. వాటి ద్వారా నయం చేయవచ్చు. అందువల్ల టీకా వేసుకున్న తర్వాత అరగంట సేపు టీకా కేంద్రంలోనే వేచిఉండాలి.  
  • అతి తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తే వెంటనే 102 లేదా 108 నంబర్లకు ఫోన్‌ చేసి పైస్థాయి ఆసుపత్రులకు తరలించాలి.  
  • రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా 420 అంబులెన్స్‌(108)లను అందుబాటులో ఉంచుతుంది.  
  • అలాగే ఆర్‌బీఎస్కేకు చెందిన 300 అత్యవసర వాహనాలు ఉంటాయి. ఇవిగాక ప్రభు త్వ, ప్రైవేట్‌ అంబులెన్సులుంటాయి. అన్ని టీకా కేంద్రాలకు అందుబాటులో అత్యవసర అంబులెన్సులు ఉంటాయి.  
  • సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తే టీకా కేంద్రంలో ఉన్న సిబ్బందికి అవసరమైన వైద్య సలహాలు ఇచ్చేందుకు నిమ్స్‌లో టెలి మెడిసిన్‌ పద్ధతి లో ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top