ఒకరికి ఉద్వాసన.. ముగ్గురికి చాన్స్‌? | Congress High Command Focus On Cabinet Expansion: Telangana | Sakshi
Sakshi News home page

ఒకరికి ఉద్వాసన.. ముగ్గురికి చాన్స్‌?

Jun 10 2026 4:43 AM | Updated on Jun 10 2026 4:43 AM

Congress High Command Focus On Cabinet Expansion: Telangana

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌!

ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి కబురు.. నెలాఖరులోపే మార్పులు, చేర్పులు! 

కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఎవరో ఒకరే... 

ఆది శ్రీనివాస్, బాలు నాయక్‌లకు చోటు? 

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మంత్రి పదవిని పరిశీలిస్తున్న అధిష్టానం 

పలువురి శాఖల్లో మార్పులకూ అవకాశం

మంత్రుల పనితీరుపై అధిష్టానం వద్ద నివేదికలు 

ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కర్ణాటకలో అధికార మార్పిడి పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ వ్యవహారాలపై అధిష్టానం దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తవుతుండటం, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కర్ణాటకలో అధికార మార్పిడి టాస్క్ లు పూర్తి కావడంతో తెలంగాణ వ్యవహారాలపై కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన దిశగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ప్రస్తుత కేబినెట్‌ నుంచి వీలును బట్టి ఒకరికి ఉద్వాసన పలకడం, ఇద్దరు లేదా ముగ్గురిని కొత్తగా కేబినెట్‌లోకి తీసుకోవాలని హస్తిన పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.

ఉద్వాసన పలికే అవకాశం ఉన్న మంత్రుల్లో ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు, దక్షిణ తెలంగాణకు చెందిన ఒకరు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే కొంత మేరకు అధిష్టానం కసరత్తు చేయగా, మంత్రుల పనితీరుపై తమ వద్ద ఉన్న నివేదికల ఆధారంగా మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా ఏ క్షణమైనా హైకమాండ్‌ నుంచి కబురు వస్తుందని, ఈ నెలాఖరులోపే మార్పులు జరగవచ్చనే చర్చ గాం«దీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.  

సంకేతాలిస్తున్న ఇటీవలి పరిణామాలు.. 
రాష్ట్ర కేబినెట్‌ విస్తరణపై చాలా కాలంగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ముందు అజహరుద్దీన్‌ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత వెంటనే విస్తరణ ఉంటుందనే చర్చ జరిగింది. కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు రావడం, అధిష్టానం బిజీగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని పరిణామాలు వేగంగా జరుగుతున్నాయని, ఈ పరిణామాలను బట్టి త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిలు ఢిల్లీ పెద్దలను కలవడం, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ కూడా అధిష్టానం పెద్దలతో భేటీ కావడం, ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పెద్దలతో సమావేశమవుతుండడం, మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాహుల్‌గాం«దీని ఇటీవల కలవడం లాంటి ఘటనలు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ లేదంటే ప్రక్షాళన జరుగుతుందనే దానికి ఊతమిస్తున్నాయి.  

పలు కోణాలు.. పలువురు ఆశావహులు 
    ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మరో రెండు బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడం కోసం పలు కోణాలను కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లాకు ఈసారికి పీసీసీ అధ్యక్ష పదవి తోనే సరిపెట్టే అవకాశాలున్నాయి. నల్లగొండ జిల్లా విషయానికి వస్తే ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎన్నికలకు ముందు తనకు ఇచ్చిన మాట మేరకు రాజగోపాల్‌రెడ్డి, ఎస్టీ లంబాడా కోటాలో బాలూనాయక్‌లో కేబినెట్‌లో చోటు ఆశిస్తున్నారు. ప్రస్తుత కేబినెట్‌ కూర్పు ప్రకారం ఈ రెండు సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి.

కానీ రాజగోపాల్‌రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి ఇప్పటికే కేబినెట్‌లో ఉన్న నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి మాత్రమే కేబినెట్‌లో అవకాశం ఉంటుందని ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఎస్టీ కోటాలో బాలూనాయక్‌ మంత్రిపదవిని ఆశిస్తున్నారు. సీఎం రేవంత్‌ కూడా లంబాడా వర్గానికి కేబినెట్‌లో చోటు కల్పించాలని భావిస్తున్నారు. అయితే నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులవుతారనే సమీకరణం బాలూనాయక్‌కు ఆటంకంగా మారుతుందనే చర్చ జరుగుతోంది.

ఒకవేళ లంబాడా వర్గానికి కేబినెట్‌లో అవకాశం ఇస్తే బాలూనాయక్‌కే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. లేదంటే అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన్ను నియమించే అవకాశముందని కూడా సమాచారం. ఇక బీసీ సామాజికవర్గాల్లో బలమైన మున్నూరు కాపు సామాజికవర్గానికి కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్‌కు కేబినెట్‌లో చోటు కల్పించే అంశం కూడా ఇటు సీఎం, అటు అధిష్టానం పరిశీలనలో ఉందని తెలుస్తోంది. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్‌లో స్థానంపై గంపెడాశలు పెట్టుకున్నారు.  

కేబినెట్‌లోకి స్పీకర్‌! 
అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఈసారి కేబినెట్‌లో తీసుకుంటారని, ఈ అంశాన్ని అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోందనే చర్చ కొంతకాలంగా జరుగుతోంది. ఆయన స్థానంలో మరో సీనియర్‌ నేతకు అవకాశం కల్పిస్తారని, గడ్డం ప్రసాద్‌కు మంత్రిగా అవకాశమివ్వడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఆ జిల్లా రెడ్డి సామాజికవర్గం నుంచి తీవ్రంగా ఉన్న పోటీకి చెక్‌ పెట్టవచ్చనే ఊహాగానాలు విని్పస్తున్నాయి. ఆయన ఇటీవల పార్టీ పెద్దలను కలవడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది.  

పని భారం తగ్గించుకునే యోచనలో సీఎం 
ఎన్నికల కేబినెట్‌ రానున్న నేపథ్యంలో తన పనిభారాన్ని తగ్గించుకోవాలనే యోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. తన వద్ద ఉన్న అదనపు శాఖలను ఆయన వదులుకుంటారని, ఈ శాఖలను కూర్చే పనిలో భాగంగా ప్రస్తుత మంత్రుల వద్ద ఉన్న కీలక శాఖలు కూడా మారతాయని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్లుగా గుర్తింపు ఉన్న కొందరు మంత్రులు కూడా తమకు కేటాయించిన శాఖలు మార్చాలని అధిష్టానాన్ని, సీఎంను కోరుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ఎవరి శాఖలు మారుతాయన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన ఎప్పుడన్నది రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో ఉత్కంఠను కలిగిస్తోంది.  

ఒకరిపై వేటు తప్పదా?
ప్రస్తుత మంత్రుల పనితీరుపై అధిష్టానం వద్ద నివేదికలున్నాయని, ఈ నివేదికల ఆధారంగా ఒక కేబినెట్‌ మంత్రిని తప్పిస్తారనేది కూడా గాం«దీభవన్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రాజకీయంగా మంత్రుల వ్యవహారశైలితో పాటు ఆయా శాఖల్లో వారి పనితీరును అధిష్టానంతో సత్సంబంధాలున్న ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ద్వారా అంచనా వేస్తున్నారని, ఈ నివేదికల ఆధారంగానే ఎవరిని తప్పించాలన్నది నిర్ణయిస్తారని సమాచారం. అయితే సామాజిక సమీకరణలు కూడా ఈ తొలగింపునకు ప్రాతిపదికగా మారతాయని, అన్నీ కుదిరితేనే ప్రస్తుతమున్న మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన ఉంటుందని సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement