మరోసారి పీఠమెక్కేదెవరో..? | Competition From Major Parties In Mahbubabad Manukota Parliamentary Elections, More Details Inside| Sakshi
Sakshi News home page

మరోసారి పీఠమెక్కేదెవరో..?

Published Sat, May 4 2024 12:51 PM

Competition From Major Parties In Mahbubabad Manukota Parliamentary Elections

మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు మాజీ ఎంపీలే..

మరోసారి గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు

సొంత పరిచయాలు.. పార్టీల చరిష్మాతో ప్రచారం

సాక్షి, మహబూబాబాద్‌: మానుకోట పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు గతంలో ఎంపీగా గెలిచిన వారే. ఇందులో ఏ ఇద్దరిని చూసినా ఒకే పార్టీలో పనిచేసిన పరిచయాలు ఉన్నాయి. గతంలో పనిచేసిన అనుభవానికి.. ప్రస్తుత పార్టీల చరిష్మాతో ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ముగ్గురు సమర్థులే కావడంతో..  ఎంపీ పీఠం మళ్లీ ఎవరికి దక్కుతుందో అనేది పార్లమెంట్‌ పరిధిలో చర్చగా మారింది.

ముగ్గురు ముగ్గురే..
2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీచేసిన బలరాంనాయక్‌ సమీప అభ్యర్థి కుంజ శ్రీనివాసరావుపై 68,957ఓట్ల మెజార్టీతో గెలిచి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. కేంద్ర కేబినెట్‌లో సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన సీతారాంనాయక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌పై 34,992 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన మాలోత్‌ కవిత బలరాంనాయక్‌పై 1,46,663ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఇందులో కవిత, సీతారాంనాయక్‌ బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందగా.. వారిద్దరి చేతిలో బలరాంనాయక్‌ ఓటమిపాలవ్వడం గమనార్హం.

ఒకరి ఓట్లకు మరొకరు గాలం..
మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పాత వారే కావడంతో.. వారు పోటీ చేస్తున్న పార్టీతో పాటు.. ఇతర పార్టీల్లోని ఓటర్లకు గాల వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో ఉన్న కవిత.. 2009లో కాంగ్రెస్‌ నుంచి మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్‌ఎస్‌ నాయకుడు శంకర్‌నాయక్‌ చేతిలో ఓడిపోయారు. తర్వాత కవిత బీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీగా గెలిచారు.

కాగా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు కవితకు మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత వర్గీయుల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాగా ప్రస్తుతం ఆమె పోటీలో ఉండడంతో కాంగ్రెస్‌ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా డోర్నకల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన రెడ్యానాయక్‌కు కవిత కూతురు కావడం.. ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నాయకులతో ఉన్న పాత పరిచయాలు కూడా ఇప్పుడు కవితకు ఓటు బ్యాంకుగా మారే అవకాశం లేకపోలేదు.

అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సీతారాంనాయక్‌ తెలంగాణ ఉద్యమకారుడిగా.. గిరిజన సామాజిక వర్గం నుంచి మేధావిగా గుర్తింపు పొందారు. ఈమేరకు 2014లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందారు. కాగా ఎన్నికల వరకు బీఆర్‌ఎస్‌లో ఉన్న సీతారాంనాయక్‌కు మానుకోట పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిచయాలు ఉన్నారు. ఇప్పుడు ఆయన వారి వద్దకు వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరుతూ.. బీఆర్‌ఎస్‌ ఓట్లకు గండి పెడుతున్నారు. ఇక బలరాంనాయక్‌కు అధికార పార్టీ ఎమ్మెల్యేలే అతిపెద్ద బలం.

ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఆయన గెలుపును ఎమ్మెల్యేలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చే మెజార్టీతోనే అధినాయకుడి వద్ద మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లతోపాటు.. బీఆర్‌ఎస్‌ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆ పార్టీ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇలా ముగ్గురు అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల ఓట్లను చీల్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement