
పలువురు కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్టులకు నిధులు కోరే అవకాశం
వీలైతే పార్టీ పెద్దలనూ కలిసే చాన్స్.. రేపు రాత్రికి తిరిగి హైదరాబాద్‌కు రాక
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకోసం పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లను సీఎంవో కోరింది. ఈ పర్యటనలో భాగంగా పలు రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను సీఎం కలిసి కోరుతారని.. వీలునుబట్టి పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశముందని తెలుస్తోంది. తిరిగి ఆయన మంగళవారం రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారని సమాచారం.
సీఎంతో 45 నిమిషాలపాటు మంత్రి సురేఖ భేటీ
అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదివారం సీఎం రేవంత్‌ను కలిశారు. తన కుమార్తె సుస్మితా పటేల్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆమె.. రేవంత్‌తో దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారని సమాచారం. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా రాజకీయాలు, పార్టీ నేతల వ్యవహార శైలి, తమపై వచి్చన ఫిర్యాదులకు సంబంధించి సీఎంతో చర్చించారు. అలాగే తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు గురించి కూడా సీఎంతో మంత్రి మాట్లాడారని తెలియవచ్చింది.
