
హైదరాబాద్: వచ్చే నెల(ఆగస్టు) ఆరో తేదీన సీఎం రేవంత్‌రెడ్డి బృందం ఢిల్లీకి పయనం కానుంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏమిటో తేల్చుకోవడానికి సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కల్పించేందుకు గాను బీసీ బిల్లును తీసుకొచ్చింది. దీనికి కేంద్ర ఆమోద ముద్ర కావాలి. ఈ క్రమంలోనే ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది.
42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ధ ధర్నా చేయాలని తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ రోజు(సోమవారం. జూలై 28) జరిగిన కేబినెట్ భేటీలో బీసీ బిల్లు అంశానికి సంబంధించి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు ,ఎమ్మెల్యే లు ,ఎంపీలు ఢిల్లీ వెళ్లి బీసీ బిల్లుపై డిమాండ్ చేయనున్నారు.
తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘ ‘ ఈడబ్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం క్యాప్ ఎప్పుడో ఎత్తేసారు. ఆర్ కృష్ణయ్య మౌనం వీడాలి... మాతో కలసి రావాలి. ఇండీ కూటమి పార్టీలతో కలసి పోరాటం చేస్తాం. రిజర్వేషన్ల కోసం సామ ధాన దండన ఉపయోగిస్తాం. బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లలో ఉన్న ముస్లింలను ఎందుకు తొలగించడం లేదు. అక్కడ తొలగించి మమ్మల్ని అడగాలి. బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వని బీజేపీకి మమ్మల్ని విమర్శించే హక్కు లేదు’ అని మండిపడ్డారు.