ఏపీతో చర్చించొద్దా? | CM Revanth Reddy Sensational Comments in chit chat With Media At Delhi | Sakshi
Sakshi News home page

ఏపీతో చర్చించొద్దా?

Jul 18 2025 4:22 AM | Updated on Jul 18 2025 4:22 AM

CM Revanth Reddy Sensational Comments in chit chat With Media At Delhi

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం రేవంత్‌. చిత్రంలో రఘువీర్, శ్రీధర్‌బాబు, ఉత్తమ్, చామల

ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

నదీ జలాల విషయంలో భారత్‌–పాకిస్తాన్‌ మధ్యే చర్చలు 

కృష్ణా, గోదావరి జలాలపై మేం చర్చిస్తే తప్పేంటి? 

గతంలో చంద్రబాబుతో కేసీఆర్, హరీశ్‌రావు చర్చించలేదా? 

కేంద్రం చర్చకు పిలిస్తే ఢిల్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌కు రావాలా? 

నీళ్ల ద్రోహి కేసీఆరే.. పదేళ్లలో కృష్ణాలో 1200 టీఎంసీలు పోనిచ్చిండు

సినిమాల్లో విలన్లను ఆఖర్లో చంపుతారు.. ‘కాళేశ్వరం’ విషయంలోనూ మెల్లగా అరెస్టులు..

కేటీఆర్‌ది గంజాయి బ్యాచ్‌  

కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం.. కొట్లాట నా చివరి అస్త్రం 

కేంద్రంతోపాటు ఏపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం 

సెప్టెంబర్ లోగా స్థానిక ఎన్నికలు 

రెండేళ్ల తర్వాతే నామినేటెడ్‌ చైర్మన్ల నియామకం ఉంటుందని వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ:  ‘నదీ జలాల విషయంలో భారత్‌–పాకిస్తాన్‌ మధ్యే చర్చలు జరుగుతున్నాయి. నీటి పంపకాలపై రెండు దేశాలు మాట్లాడుకుంటున్నాయి. అలాంటప్పుడు కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై పొరుగు రాష్ట్రంతో మేం చర్చిస్తే తప్పేంటి. నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రితో చర్చలే వద్దన్న తరహాలో బీఆర్‌ఎస్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 2015–16లో చంద్రబాబునాయుడుతో చర్చలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌ వెళ్లలేదా? ఇప్పుడు మేము వెళితేనే నొప్పొచ్చిందా?. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగాలి. మేము రాజకీయంగా బతకాలన్నది వారి కోరిక. అందుకే మా భేటీపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. కేంద్రంతో కలిసి పనిచేసేందుకు కూడా మాకెలాంటి అభ్యంతరం లేదు.

నేనెవరికీ భయపడను. కేవలం సిస్టమ్‌కు మాత్రమే భయపడే వ్యక్తిని. నా ప్రాధాన్యత రాష్ట్రం. సమస్య ఉంటే చర్చలతో పరిష్కరించుకుంటా. కొట్లాట నా చివరి అస్త్రం. ఇదే ధోరణిలో కేంద్రంతో పాటు పక్క రాష్ట్రం ఏపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం. కొట్లాడుకుంటూ పోతే పాలకులకు కాదు, ప్రజలకు నష్టం..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నదీ జలాల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వచి్చన సీఎం గురువారం తన అధికారిక నివాసంలో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. పలు అంశాలపై వివరంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌పై విమర్శనా్రస్తాలు సంధించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

కేసీఆర్‌ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే.. 
కేంద్ర జలశక్తి మంత్రి వద్ద సమావేశంలో బనకచర్లపై చర్చ జరగలేదు. జలశక్తి శాఖ తన ప్రకటనలో కూడా అదే చెప్పింది. ఆ భేటీ భవిష్యత్‌ కార్యాచరణకు రోడ్‌మ్యాప్‌ వంటిది. మేం పూర్తిగా కేంద్రానికి సహకరిస్తాం. వారి సహకారం తీసుకుంటాం. కలిసి పనిచేస్తాం. నిధులైనా, అనుమతులైనా అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కాబట్టి అడిగి తీసుకుంటాం. కేంద్రం పిలిస్తే మీరెందుకు వెళ్తారని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశి్నస్తున్నారు. కేంద్ర పిలిస్తే ఢిల్లీకి రాకుండా, ఫాంహౌస్‌కు రావాలా? కేంద్రం వద్ద వాదన వినిపించకుండా, ఫాంహౌస్‌లో వాదించాలా? కేసీఆర్‌తో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, ఆయన నాకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. ఆయనతో ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమే. 

అన్నీ అధ్యయనం చేశాకే ‘ఇచ్చంపల్లి’.. 
కేంద్ర ప్రభుత్వమే గోదావరి–కావేరి నదుల అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్‌ ప్రతిపాదనను ఇచ్చిం ది. తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేదైతే ఈ లింక్‌పై చర్చిస్తామని కేంద్రానికి చెప్పాం. ఎప్పుడో తయారు చేసిన డీపీఆర్‌ ప్రకారం అయితే దీనికి ఒప్పుకునేది లేదు. అది తయారయ్యాక ఎగువ రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టులు వచ్చేశాయి. కాబట్టి ప్రస్తుతం నీటి లభ్యత ఎంత ఉందో తేలాలి. వందేళ్ల రాష్ట్ర అవసరాలకు సరిపడా నీటి లభ్యత, అవసరాలు అన్నీ అధ్యయనం చేశాకే ముందుకెళ్తాం తప్ప గుడ్డిగా వ్యవహరించం. 

400 టీఎంసీలు చాలన్నది కేసీఆరే.. 
నీళ్ల ద్రోహి కేసీఆరే. 2004–2014 వరకు శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి రోజుకు 4.1 టీఎంసీల చొప్పున నీళ్లు తరలించుకుపోతే, 2014–23 మధ్య ఆ సామరŠాధ్యన్ని ఏకంగా 9.6 టీఎంసీలకు పెంచనిచ్చిం ది కేసీఆరే. అంతకుముందు ఉమ్మడి ఏపీలో పదేళ్లలో 727 టీఎంసీలు ఏపీ తరలించుకుపోతే, బీఆర్‌ఎస్‌ పదేళ్ల హయాంలో ఏకంగా 1,200 టీఎంసీల నీటిని ఏపీకి పోనిచ్చాడు. దీన్నిబట్టి నీళ్ల ద్రోహి ఎవరో తెలుస్తోంది. మరోవైపు 2023లో కృష్ణా జలాల్లో 400 టీఎంసీలు చాలు అన్నది కేసీఆరే.

గోదావరిలో 3వేల టీఎంసీలు వృధాగా పోతున్నాయి. వాటిని వాడుకోండని ఏపీకి చెప్పింది ఆయనే. చేపల పులుసు తిని అది అరిగేదాకా కూడా ఆగకుండా నీళ్లు వాడుకోమని చెప్పారు. ఇదే సమయంలో ‘కాళేశ్వరం’ కూలిపోతే ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. మేం ఒక్కొక్కరిపై చర్యలు తీసుకుంటున్నాం. సినిమాల్లో విలన్లను ఆఖరిలో చంపినట్లు ఇక్కడా మెల్లిగా అరెస్టులు జరుగుతాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కేజీవ్రాల్‌ అరెస్టు చివర్లోనే జరిగింది కదా. 

42% రిజర్వేషన్ల అమలుపై ప్రత్యేక వ్యూహం 
2014కు ముందు కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది. 2014లో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక 23 శాతానికి తగ్గించారు. రిజర్వేషన్లు 50శాతం దాటకూడదని 2018లో పంచాయతీరాజ్‌ చట్టాన్ని తెచ్చి బీసీలకు అన్యాయం చేశారు. ప్రస్తుతం 50 శాతం క్యాప్‌ను ఎత్తివేస్తున్నాం. 42 శాతం రిజర్వేషన్ల అమలుపై మాకు ప్రత్యేక వ్యూహం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేసి తీరుతాం.

కోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు పెడతాం. అందుకే ఆర్డినెన్స్, మిగతా ప్రక్రియపై దృష్టి పెట్టాం. గుజరాత్, యూపీ, మహారాష్ట్రల్లో ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించాక, తెలంగాణలో రిజర్వేషన్లపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడాలి. రాష్ట్రంలో రెండేళ్ల తర్వాతే కొత్త నామినేటెడ్‌ చైర్మన్‌ పోస్టులు ఇస్తాం. అప్పటివరకు ప్రస్తుత కార్పొరేషన్లకు డైరెక్టర్లు, సభ్యులను భర్తీ చేస్తాం. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ కచ్చితంగా పోటీ చేస్తుంది.  

లోకేశ్‌ను కేటీఆర్‌ చీకట్లో ఎందుకు కలిసినట్లు? 
‘నేను అధికారికంగా చర్చలో పాల్గొంటే తప్పు అంటున్నారు. మరి ఇటీవల  ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను కేటీఆర్‌ ఎందుకు కలిశాడు?, చీకట్లో కలవాల్సిన అవసరం ఏముంది?. లోకేష్‌తో భేటీ అయిన మాట వాస్తవం కాదా? చెప్పమనండి..’ అని రేవంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. లోకేశ్‌ను కలిసినట్లు మీకెలా తెలిసింది? మీరు కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. ఆ విషయాన్ని మాకు కళ్ల ముందు ఉన్న వ్యక్తులే చెప్పారని తెలిపారు.  

కేటీఆర్‌ది గంజాయి బ్యాచ్‌ 
కేటీఆర్‌ది గంజాయి బ్యాచ్‌ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘ఆ గంజాయి బ్యాచ్‌ సవాల్‌ విసిరితే నేను స్పందించాలా? కేటీఆర్‌ బిజినెస్‌ భాగస్వామి కేదార్‌æ రకరకాల డ్రగ్స్‌ వాడి దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. లిక్కర్‌లో కాక్‌టెయిల్‌ విన్నాం..కానీ ఇక్కడ గంజాయి, డ్రగ్స్‌ కాక్‌టెయిల్‌ అని వింటున్నాం. అతని ఫోరెన్సిక్‌ రిపోర్టును తెప్పించాం. సందర్భాన్ని బట్టి మీడియా ద్వారా బయటపెడతాం. అవసరమైతే అసెంబ్లీలో పెట్టడానికీ సిద్ధమే. ఆయన బావమరిది ఫాంహౌస్‌లో సమీప గ్యాంగ్‌ అంతా గంజాయి, డ్రగ్స్‌ సేవిస్తూ పట్టుబడ్డారు. ఇలా కేటీఆర్‌ చుట్టూ ఉన్న వాళ్లంతా గంజాయి బ్యాచే..’ అని సీఎం ఆరోపించారు.  

మిగిలింది కేటీఆరే.. 
మున్సిపల్‌ శాఖలో అక్రమాలకు సంబంధించి కీలక అధికారి బాలకృష్ణ అరెస్టు అయ్యారని, ఇక మిగిలింది కేటీఆర్‌ మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. కేసు ప్రస్తుతం హైకోర్టులో ఉంది. గతంలో నా ఫోన్‌ ట్యాప్‌ అయిందని చెప్పిన కిషన్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? కొత్తగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కేంద్రానికి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏడాదిన్నర్రగా ప్రభాకరావును కాపాడింది ఎవరు? ఇదే బీజేపీ, బీఆర్‌ఎస్‌ కాదా?..’ అని రేవంత్‌ ప్రశ్నించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement