
హైదరాబాద్: ఎక్కడో లండన్‌లో ఉంటూ బ్లాక్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేసుకుంటున్న ఓ బ్రిటిష్ మహిళ.. బరువు తగ్గాలన్న ఉద్దేశంతో భారతీయ డాక్టర్‌ను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. 102 కిలోల నుంచి శస్త్రచికిత్స అనంతరం 70 కిలోలకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలి కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. ఆస్పత్రి మెటబాలిక్, బేరియాట్రిక్ సర్జరీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కేశవరెడ్డి మన్నూర్ తెలిపారు.
“అలెగ్జాండ్రియా ఫాక్స్ అనే 59 ఏళ్ల మహిళ భర్త జేన్ ఫాక్స్‌కు 2023లో లండన్‌లో ఉండగా బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేశాను. ఆయన 64 కిలోల బరువు తగ్గారు. ఫలితంగా కీళ్ల నొప్పులు తగ్గిపోయాయి, మధుమేహం, రక్తపోటు కూడా అదుపులోకి వచ్చాయి. ఆ ఫలితంతో ఆయన చాలా సంతోషించారు. దాంతో 102 కిలోల బరువు ఉన్న అలెగ్జాండ్రియా తాను కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుని, అందుకు భారతీయ వైద్యుడైన డాక్టర్ కేశవరెడ్డి దగ్గరకే వెళ్లాలని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. ఆమెకు ఊబకాయంతో పాటు అధిక రక్తపోటు, కిడ్నీ వైఫల్యం, థైరాయిడ్ లాంటి సమస్యలున్నాయి. దాంతో తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చేశారు.
ఆమెకు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే శస్త్రచికిత్స చేశాం. ముందుగా మత్తుమందుకు సంబంధించిన పరీక్షలు చేశాం. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో శస్త్రచికిత్స చేసి, ఉదరభాగంలో 2/3 వంతు తొలగించాం. దాంతో కడుపు చిన్నగా అయిపోయింది. దీనివల్ల ఆమె మధుమేహం, రక్తపోటు అదుపులోకి వచ్చాయి. దాంతోపాటు కిడ్నీ వైఫల్యం కూడా తగ్గింది. ఆమెకు చాలా సానుకూల దృక్పథం ఉండడంతో 24 గంటల్లోనే కోలుకున్నారు. దాంతో శస్త్రచికిత్స అయిన మర్నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం. రెండురోజుల్లోనే తన హోటల్ గదిలో ఆమె అటూ ఇటూ హాయిగా తిరిగేస్తున్నారు. త్వరగా కోలుకుని తన పనులు తాను చేసుకుంటున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. మూడు రోజుల్లో తిరిగి ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
అలెగ్జాండ్రియా ఇంగ్లండ్‌లో బ్లాక్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. అది అక్కడ చాలా గౌరవప్రదమైన, కష్టమైన వృత్తి. దానికి ముందుగా మూడేళ్ల శిక్షణ తీసుకోవాలి. లండన్ నగరంలోని ప్రతి వీధి బాగా తెలిసి ఉండాలి. ఈ టాక్సీలను అక్కడ చాలా గౌరవనీయంగా చూస్తారు. ఇంత గౌరవప్రదమైన పని చేసేటప్పుడు తనకు ఆరోగ్య సమస్యలు ఉండకూడదని భావించడం వల్లే అలెగ్జాండ్రియా ఇక్కడివరకు వచ్చి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది చాలా సులభమైన శస్త్రచికిత్స. ఇందులో సరికొత్త పరిశోధనలు కూడా చేసి ఉదరభాగం మళ్లీ వ్యాకోచించకుండా ఉండేలా చేస్తున్నాం. దీనివల్ల దీర్ఘకాలం పాటు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత మధుమేహం, రక్తపోటు, నిద్రలేమి లాంటి చాలా సమస్యలు తగ్గిపోతాయి. జీవన ప్రమాణం కూడా మరో పదేళ్లు పెరుగుతుంది. ఇది చాలా సురక్షితమైన శస్త్రచికిత్స. బరువు తగ్గడానికి మందులు వాడడం కంటే ఇది చేయించుకోవడం చాలా మంచిది” అని డాక్టర్ కేశవరెడ్డి వివరించారు.