హైదరాబాద్: ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో భవిష్యత్‌లో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించకపోతే భవిష్యత్‌లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. ఇప్పటి నుంచి వచ్చే జూన్ వరకూ తాగు నీరు, సాగు నీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో సరైన యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిందేనన్నారు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. నిర్వహించారు. దీనికి ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ విద్యుత్ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉంది. కానీ .. మార్కెట్‌లో విద్యుత్ అందుబాటులో లేదు. అందుకే అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది.
విద్యుత్ ఆధారిత పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. కోవిడ్ సంక్షోభంలా,, ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. ప్రతీ కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలి. ఎల్‌నినో ప్రభావంపై సినిమా, మీడియా, కళాజాతలతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలకు అవగాహన కల్పించాలి. భవిష్యత్‌లో నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలి. చుక్క నీరు కూడా వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని సూచించారు.
ఇదీ చదవండి: రోడ్ టెండర్లలో వేల కోట్ల కుంభకోణం.. కేటీఆర్


