Sakshi News home page

3 క్లస్టర్లుగా తెలంగాణ 

Published Sun, Jan 7 2024 5:08 AM

CM Revanth Reddy says Telangana into 3 clusters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందడానికి వీలుగా మహా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కొత్త విధానంలో తెలంగాణను మొత్తం మూడు క్లస్టర్లుగా విభజించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపల అర్బన్‌ క్లస్టర్, ఓఆర్‌ఆర్‌ తర్వాత రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) వరకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌ క్లస్టర్, ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని రూరల్‌ క్లస్టర్‌గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.

2050 నాటికి హైదరాబాద్‌ తరహాలో తెలంగాణ అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నది తమ లక్ష్యమని, అందుకు తగ్గట్టుగా మహా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలతో స్నేహపూర్వకంగా మెలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులు శనివారం సచివాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. 

అత్యున్నత అభివృద్ధి సాధనే లక్ష్యం 
పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, రాయితీలు, ప్రోత్సాహకాల కోసం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని తీసుకుని వస్తామ సీఎం చెప్పారు. తెలంగాణలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే.. 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని అన్నారు. రాబోయే రోజుల్లో అత్యున్నత అభివృద్ధి దశకు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందనే వాదనలకు భిన్నంగా తమ ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తుందని అన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్‌ తరహాలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తాము తెచ్చే కొత్త పారిశ్రామిక విధానానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.  

ఫార్మా విలేజీల అభివృద్ధి 
ఫార్మా సిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని, ఫార్మా సిటీగా కాకుండా ఫార్మా విలేజీలను అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఓఆర్‌ఆర్‌పై 14 రేడియల్‌ రోడ్లు ఉన్నాయని, వీటికి 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని, వీటికి అందుబాటులో ఉండేలా దాదాపు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకో ఫార్మా విలేజీని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా, కాలుష్య రహితంగా, పరిశ్రమలతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు ఇతర అన్ని మౌలిక సదుపాయాలతో వీటిని అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. రక్షణ, నావికా రంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి హైదరాబాద్‌లో అపారమైన అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. కొత్తగా సోలార్‌ పవర్‌ పాలసీని రూపొందిస్తామని, సోలార్‌ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు.  
 
స్కిల్‌ వర్సిటీలు ఏర్పాటు చేస్తాం 
రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులను గత ప్రభుత్వం మాదిరిగా భారంగా భావించటం లేదని సీఎం స్పష్టం చేశారు. వీరందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా చూస్తామని, యువతీ యువకులకు అవసరమైన నైపుణ్యాలు (స్కిల్స్‌) నేర్పించేందుకు స్కిల్‌ యూనివర్సిటీలను నెలకొల్పుతామని చెప్పారు.

ఈ సమావేశంలో సీఎస్‌ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్, సీఎం స్పెషల్‌ సెక్రెటరీ అజిత్‌ రెడ్డి, సీఐఐ ప్రతినిధులు సి.శేఖర్‌ రెడ్డి, అనిల్‌ కుమార్, మోహన్‌ రెడ్డి, సతీష్‌ రెడ్డి, సుచిత్రా కె.ఎల్లా, వనిత దాట్ల, రాజు, సంజయ్‌ సింగ్, ప్రదీప్‌ ధోబాలే, శక్తి సాగర్, వై.హరీశ్‌చంద్ర ప్రసాద్, గౌతమ్‌ రెడ్డి, వంశీకృష్ణ గడ్డం, శివప్రసాద్‌ రెడ్డి రాచమల్లు, రామ్, చక్రవర్తి, షేక్‌ షమియుద్దీన్, వెంకటగిరి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
Advertisement