మీరు గడప దాటండి..: సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy directive to secretaries and collectors of govt departments | Sakshi
Sakshi News home page

మీరు గడప దాటండి..: సీఎం రేవంత్‌రెడ్డి

Jul 3 2024 12:50 AM | Updated on Jul 3 2024 4:50 AM

CM Revanth Reddy directive to secretaries and collectors of govt departments

ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

ఉన్నతాధికారులు జిల్లాల పర్యటనలకు వెళ్లాలి 

కలెక్టర్లు ఆస్పత్రులు, పాఠశాలలు సందర్శించాలి 

ఉన్నతాధికారులు ఒక్కొక్కరు ఒక్కో ఫ్లాగ్‌షిప్‌ ఐడియా ఇవ్వాలి 

కరమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా పాటించాలి 

సీఎంఓ సూచనలు పాటించాలి..సొంత నిర్ణయాలతో సర్కారుకు చెడ్డపేరు తేవొద్దు  

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎన్నికల కోడ్‌ కారణంగా వంద రోజులు ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయి. ఇకపై ఉన్నతాధికారులు విధిగా పరిపాలనపైనే దృష్టి సారించాలి. ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు క్రమశిక్షణ పాటించాలి. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సమయపాలనను తప్పనిసరిగా పాటించాలి. ప్రతిరోజూ పనివేళల్లో సచివాలయంలో అందుబాటులో ఉండాలి. కేవలం కార్యాలయాలకు పరిమితం కాకుండా తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు వారానికో రోజు విధిగా జిల్లాల పర్యటనలకు వెళ్లాలి. 

నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. కార్య క్రమాల అమలు, పనుల పురోగతిని తెలుసుకోవాలి. చాలా జిల్లాల్లో కలెక్టర్లు కార్యాలయాలు దాటడం లేదు. కలెక్టర్లు విధిగా క్షేత్ర పర్యటనకు వెళ్లేలా సీఎస్‌ చూడాలి. ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను కలెక్టర్లు సందర్శించాలి..’అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో 29 ప్రభుత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

శాఖల పనితీరుపై పట్టు సాధించాలి 
‘ఐఏఎస్‌ అధికారులందరూ సచివాలయం నుంచి క్షేత్ర స్థాయి వరకు విధిగా తమ పరిధిలోని శాఖలు, విభాగాల పనితీరుపై పట్టు సాధించాలి. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలను ఎప్పటికప్పుడు నేరుగా సీఎంవోతో పంచుకోవాలి. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్‌ షిప్‌ ఐడియాను రెండు వారాల్లో ప్రభుత్వానికి సమరి్పంచాలి..’అని ముఖ్యమంత్రి కోరారు.  

అవసరమైతే ప్రక్షాళన చేయండి 
‘మీ శాఖల పని తీరును మెరుగుపరిచేందుకు అవసరమైతే అధికారులు, సిబ్బంది ప్రక్షాళన చేపట్టాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు పలువురు ముఖ్యమంత్రులతో పని చేసిన అనుభవమున్న అధికారులు ఇప్పటికీ కీలక విభాగాల్లో ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి తమ పనితీరును చాటుకోవాలి. ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలనే సంకల్పంతో విధులు నిర్వహించాలి. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి. 

ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా పాలనను అందించేందుకు బాధ్యతగా పని చేయాలి. అధికారులందరూ ఏకతాటిపై పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. వ్యక్తుల ఇష్టాయిష్టాలతో ప్రభుత్వానికి సంబంధం లేదు. అధికారులపై రాగద్వేషాలేమీ లేవు. కేవలం పని తీరు ఆధారంగానే అధికారులకు తదుపరి ఉన్నత అవకాశాలుంటాయి. బాగా పని చేసే వారికి ప్రోత్సాహకాలుంటాయి. లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు. ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలి..’అని సీఎం స్పష్టం చేశారు.  

త్వరలో జిల్లాల పర్యటన 
త్వరలోనే వారానికో జిల్లా పర్యటనకు వెళతానని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని అన్నారు. ప్రజలను స్వయంగా కలుసుకునేలా తన పర్యటన ఉంటుందని చెప్పారు. ఈ మేరకు షెడ్యూలు త్వరలో విడుదల చేస్తామన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement