ఏడాదిలోగా చేయాలి: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy on Central Govt caste census decision | Sakshi
Sakshi News home page

ఏడాదిలోగా చేయాలి: సీఎం రేవంత్‌

May 2 2025 2:04 AM | Updated on May 2 2025 2:04 AM

CM Revanth Reddy on Central Govt caste census decision

మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌. చిత్రంలో కేకే, మధుయాష్కీ

కేంద్రం కులగణన నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ప్రధాని మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..అభినందిస్తున్నాం 

ముందు విధివిధానాలేమిటో స్పష్టం చేయాలి..

ప్రజల సూచనలు స్వీకరించాలి 

రహస్యంగా కాకుండా అందర్నీ భాగస్వాముల్ని చేయాలి 

మంత్రుల ఉపసంఘాన్ని, నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి 

రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆత్రుత వారి మాటల్లో కనిపిస్తోంది... పహల్గాం దాడి నుంచి పక్కదారి

పట్టించడానికా? బిహార్‌ ఎన్నికల కోసమా? 

ఏదైనా సరే.. బలహీనవర్గాలకు ప్రయోజనం కలిగే కార్యక్రమానికి సహకరిస్తామన్న సీఎం

సాక్షి, హైదరాబాద్‌: కులగణన విధివిధానాలేమిటో కేంద్రం తొలుత స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రహస్యంగా కాకుండా పార్లమెంటరీ వ్యవస్థలో అందర్నీ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని కోరారు. దీనిపై తక్షణమే మంత్రివర్గ ఉప సంఘాన్ని, నిపుణులతో కూడిన అధికారిక కమిటీని నియమించాలని సూచించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. 

తూతూమంత్రంగా కాకుండా శాస్త్రీయంగా కులగణన చేపట్టాలని, ఏడాదిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, హర్కర వేణుగోపాల్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజ్‌ఠాకూర్, బీర్ల ఐలయ్య వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యాంశాలు సీఎం మాటల్లోనే.. 

రాహుల్‌ ప్రతిపాదనను గౌరవించడం గొప్పతనం 
మా ఒత్తిడికి తలొగ్గి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. ఒకవేళ పహల్గాం దాడి నుంచి పక్కదారి పట్టించడానికో, బిహార్‌ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నా సరే. దేశ వ్యాప్తంగా బలహీనవర్గాలకు ప్రయోజనం కలుగుతున్నప్పుడు.. ప్రభుత్వపరంగా, రాజకీయంగా ఇందుకు పూర్తిగా సహకరిస్తాం. 

మా అనుభవాలను పంచుకోవడానికి, కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్‌జోడో యాత్రలో రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో కులగణన చేపడ్తామని, కేంద్రంలో అధికారంలోకి వస్తే జనగణనతో పాటు కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్‌గాంధీ ప్రతిపాదనను మోదీ గౌరవించడం గొప్పతనం. అయితే ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభిస్తారో తేదీలను ప్రధాని ప్రకటించాలి. 

కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిది 
కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిది. దీనివల్ల సంక్షేమ పథకాలు, నిధులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఆయా కులాలకు కచ్చితంగా అందించడానికి వీలవుతుంది. దాదాపు వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో సమగ్ర కులగణన చేశాం. రాహుల్‌గాంధీ సూచనలు తీసుకుని ఎలాంటి వివాదాలు, తప్పులు లేకుండా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఇతర స్టేక్‌ హోల్డర్లందరినీ భాగస్వాములను చేస్తూ.. 57 ప్రశ్నలతో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా సమగ్రంగా వివరాలు సేకరించి నివేదిక రూపొందించాం. వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉండేలా భద్రత కల్పించాం. దేశానికే ఆదర్శంగా నిలబడ్డాం. సీఎస్‌ నుంచి ఎన్యూమరేటర్‌ వరకు, మంత్రివర్గ ఉపసంఘం, నిపుణుల కమిటీ ఇలా.. 1.5 లక్షల మందితో ఈ ప్రక్రియ నిర్వహించాం.  

రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నాం.. 
అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేశాం. దేశంలో జనగణనతో పాటు కులగణన తక్షణమే చేపట్టాలి అనేది మొదటిది. రెండోది బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపించాం. ఇదే డిమాండ్‌తో కుల సంఘాల మద్దతుతో ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో ఒకరోజు ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం. అయినా కులగణన చేయబోమంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసిన వారు ఇప్పుడు అంగీకరించడానికి మా ఒత్తిడే ప్రధాన కారణం. ఏది ఏమైనా కేంద్రం నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నాం. అభినందిస్తున్నాం.  

పారదర్శకంగా ముందుకు వెళ్లాలి 
ఈ ప్రక్రియ అమలులో సవాళ్లు, సమస్యలను ఏ విధంగా అధిగమిస్తారో వెల్లడించాలి. కేంద్రం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ముందుకు వెళ్లాలి. అన్ని రాష్ట్రాల్లో సమాచార సేకరణ చేయాలి. మేం అందర్నీ ఇందులో భాగస్వాములను చేశాం. కులగణన పూర్తి చేసి ఇప్పుడు దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలిచింది. మేము కుల గణన చేసినప్పుడు ఎదురైన సవాళ్లను కేంద్రంతో పంచుకోవడానికికి సిద్ధం. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది మా సంకల్పం. రాహల్‌గాంధీ ఆలోచనను అమలు చేసే క్రమంలో ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా నివేదికను ఇప్పటికే ఢిల్లీకి పంపించాం. ఏ సమాచారం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధమే. ఇక్కడకు వచి్చనా సరే.. మమ్మల్ని ఢిల్లీ రమ్మనా సరే.. ఒక మెట్టు దిగడానికి మేము రెడీ. 

పకడ్బందీగా చేసే ఆలోచన కన్పించడం లేదు 
మాది రాజకీయ ఉద్దేశంతో చేసిన కుల గణన అంటూ విమర్శలు చేసే నాయకులను ఒకే ప్రశ్న అడుగుతున్నా. 11 సంవత్సరాలుగా కేంద్రంలో, 16 రాష్ట్రాల్లో పాలనలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా కుల గణన చేసి ఆదర్శంగా నిలిచి ఉంటే.. మేము తెలంగాణ రోల్‌ మోడల్‌ అని చెప్పుకునే అవకాశం వచ్చేది కాదు. 

రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆతృత వారి (బీజేపీ) మాటల్లో కనిపిస్తోంది. పకడ్బందీగా కులగణన, జనగణన చేయాలన్న ఆలోచన వారిలో కనిపించడం లేదు. 2021లో జనగణన చేయకుండా వాయిదా వేశారు. మోదీ.. రేవంత్‌రెడ్డి విధానాలను అనుసరిస్తున్నారని స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకులు కక్కలేక మింగలేకపోతున్నారు. 

రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు.. 
ఒక రాష్ట్రంలో బీసీ ఉండి, మరో రాష్ట్రంలో ఓసీగా ఉన్న కులాలకు సంబంధించి కొందరు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్రం అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపినప్పుడు సమాధానం లభిస్తుంది. రాష్ట్ర యూనిట్‌గా రిజర్వేషన్లు అమలవుతాయి. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆయా వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు దీనితో సంబంధం లేదు. ఆ ప్రక్రియ సాగుతోంది. 

మాకంటే మెరుగ్గా వారు కులగణన చేస్తే మంచిదే. ఆస్తులు, అప్పులు, పొలాల విషయంలో అబద్ధం చెప్పొచ్చు. కానీ కులం విషయంలో ఎవరూ అబద్ధం చెప్పరు. కులాల లెక్క పక్కాగా తేలితే సంక్షేమ పథకాల అమలు సులభం. వీటికి కేంద్రం డేటానే ప్రామాణికం. అది లేనప్పుడు మేము చేసిన సర్వే డేటానే ప్రామాణికం. తెలంగాణ సేకరించిన సమాచారం దేశానికి రోల్‌మోడల్‌. 

400 సీట్లు వచ్చి ఉంటే రిజర్వేషన్లు ఎత్తేసేవారు 
బీజేపీకి గత ఎన్నికల్లో 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. రిజర్వేషన్లు ఎత్తేసేవారు. ఇప్పుడు ఈ కులగణన చేపట్టేవారు కూడా కాదు. ఎన్నికల సమయంలో మేముప్రజలను అప్రమత్తం చేయడం వల్ల వారికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా 240 సీట్లకు పరిమితం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం కారణంగానే వారి ఎజెండాను పూర్తిగా అమలు చేయలేకపోతున్నారు. రాజకీయంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే కులగణనకు నిర్ణయం తీసుకున్నారు.  

ఢిల్లీలో ఏం జరుగుతోందో ఈ బచ్చాలకు తెలియదు  
ఢిల్లీలో ఏమి జరుగుతోందో గల్లీలో తిరిగే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ బచ్చాలకు తెలియదు. నరేంద్రమోదీ ఎవరిని ఫాలో అవుతున్నారు. ఏమి ఆలోచిస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు. ఎవరి సలహా తీసుకుంటున్నారు. ఈ గల్లీల్లో తిరిగే పిల్లలకు తెలియదు. వారి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచడాన్ని మాత్రమే సుప్రీంకోర్టు తప్పుపట్టింది తప్ప.. 50 శాతం సీలింగ్‌ను కాదు. ఈడబ్ల్యూఎస్‌తో రిజర్వేషన్లు 60 శాతానికి చేరాయి.  

నమోదు చేసుకోనివారు లెక్కల్లో లేనట్లే.. 
కులగణనలో తమ పేర్లు నమోదు చేసుకోని వారు లెక్కలో లేనట్లే. కేసీఆర్‌ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఒక మాట అన్నారు. ‘ఉన్నోడే ఉన్నట్లు ..లేనోడు పోయినట్లే అని..’. వారికి ఆ స్పష్టత ఉంది. మా పార్టీ, ప్రభుత్వం హింసకు (ఆపరేషన్‌ కగార్‌పై మాట్లాడుతూ) వ్యతిరేకం. అది రాజ్యహింస అయినా, వ్యక్తులు చేసినా.. సంఘాలు చేసినా..తప్పే. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement