ఇందిరమ్మే స్పూర్తి.. కోటి మందికి చీరలు: రేవంత్‌ రెడ్డి | CM Revanth Reddy Distribute Indirama Sarees In Telangana | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మే స్పూర్తి.. కోటి మందికి చీరలు: రేవంత్‌ రెడ్డి

Nov 19 2025 1:22 PM | Updated on Nov 19 2025 3:55 PM

CM Revanth Reddy Distribute Indirama Sarees In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‍ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు సీఎం రేవంత్‌.. చీరలను అందించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలను ఇవ్వనున్నారు.  తొలి దశలో నేటి నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేయనున్నారు. రెండో దశలో మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

ఈ సందర్బంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు. బ్యాంకుల జాతీయం, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి పేదలకు భూములు పంచినా, పేదలకు ఇండ్లు కట్టించినా అది ఇందిరమ్మకే సాధ్యమైంది. పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో ధీటుగా నిలబడి ఎదుర్కొన్న ధీశాలి ఇందిరమ్మ. దేశానికి బలమైన నాయకత్వం అందించిన ఘనత ఇందిరాగాంధే.  

ఇందిరమ్మ స్ఫూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మహిళలకు పెట్రోల్ బంక్‌లు నిర్వహించుకునేలా ప్రోత్సహించాం. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలని యజమానులను చేశాం. మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టాం. ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నాం. రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాం. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేశాం. సోలార్‌ ప్లాంట్‌ మహిళలకే ఇస్తున్నాం. 

ఇందిరా గాంధీ స్పూర్తితో రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తున్నాం. మహిళలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిథ్యం ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఆడబిడ్డలకే ఇస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించాం. అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం. మార్చి 1 నుంచి 8 న మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తాం. ఎవరూ ఆందోళన చెందొద్దు.. ప్రతీ ఆడబిడ్డకు చీరను అందిస్తాం. మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నాం. చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా చీరలను పంపిణీ చేస్తున్నాం. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలి. మీరే బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలి అని పిలుపునిచ్చారు.

వైఎస్సార్ హయంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసింది. రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళలను భాగస్వామ్యులను చేస్తున్నామని నేను చెప్పాను. లబ్ధిదారులకు తప్పకుండా ఇళ్లు కట్టిస్తాం. ఇందిరా గాంధీ పాలన దేశానికి దిక్సూచి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement