CM KCR: 'హైదరాబాద్‌లో కరెంట్‌ పోదు.. ఢిల్లీలో 24 గంటలు కరెంట్‌ ఉండదు'

CM KCR Speech Public Meeting at Medchal District - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ముఖ్యమంతి కె చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. అంతాయిపల్లిలో 30 ఎకరాల స్థలంలో రూ.56.20 కోట్ల వ్యయంతో ఈ కార్యలయాలను ఏర్పాటు చేశారు. భవనంలో విశాలమైన 55 గదులను నిర్మించడం తోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో , ఏవో, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక గదులు కేటాయించారు. జిల్లా మంత్రికి ప్రత్యేక చాంబర్‌ ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునేలా సమావేశమందిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ మైదానంలో హెలిప్యాడ్‌ నిర్మాణం చేపట్టారు. కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. 

మేడ్చల్‌ జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైంది. పరిపాలన భవనాన్ని గొప్పగా నిర్మించుకున్నాం. పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత అభివృద్ధి. కేవలం 6 నెలల వ్యవధిలో భవనాలు నిర్మించాం. తెలంగాణ వచ్చాక ఎన్నో మంచి పనులు చేసుకున్నాం. ఇప్పుడున్న 36 లక్షల పెన్షన్లకు తోడు.. మరో పది లక్షల కొత​ పెన్షన్లు ఇస్తున్నాం. అందరికీ కొత్త కార్డులు ఇస్తున్పాం. 11 వేలకు పైగా క్రీడా ప్రాంగణాలు సిద్ధమవుతున్నాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

అంకిత భావం ఉంటే ఏదైనా సాధ్యమే
రాష్ట్రంలో అన్ని రంగాలకూ 24 గంటలూ కరెంట్‌ అందిస్తున్నాం. హైదరాబాద్‌లో కరెంట్‌ పోదు కానీ.. ఢిల్లీలో 24 గంటలు కరెంట్‌ ఉండదు. దేశంలో 75 ఏళ్ల నుంచి జరుగుతున్న అసమర్థ పరిపాలన, చేతకాని, తెలివి తక్కువతనం పరిపాలన వల్లే ఈ ఇబ్బందులు. దేశంలో నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనే. అంకిత భావం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. తెలంగాణపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చదవండి: (మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌)

ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే
తెలంగాణలో చాలా నిధులు ఉన్నాయి. మన రాష్ట్రం ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే. గతంలో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.లక్ష మాత్రమే. ప్రస్తుతం తెలంగాణలో తలసరి ఆదాయం రూ.2,78,500. దేశంలోనే తెలంగాణ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయి. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం. చేనేత కార్మికులకు కూడా పింఛన్లు అందిస్తున్నాం. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నాం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగాసంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దేశంలోనే అత్యధిక గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గురుకుల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా నీళ్ల కొరత తీర్చుకున్నాం. 

జాతీయ రాజకీయాల్లో మార్పు రావాలి
భవనం కట్టాలంటే చాలా కష్టం, కూలగొట్టాలంటే చాలా ఈజీ. మతం, కులం పేరిట దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఏ రకంగానూ మంచిది కాదు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పురావాలి. ఒకసారి దెబ్బతిన్నామంటే మళ్లీ ఏకం కావడం అంత ఈజీ కాదు. చైనా సింగపూర్‌, కొరియా దేశాల తరహాలో కుల మతాలకు అతీతంగా పనిచేయాలి' అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top