మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

CM KCR Inaugurate Collectorate Complex in Medchal District - Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇకపై మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్‌ ప్రారంభంతో పరిపాలన అంతా ఒకే చోట నుంచి కొనసాగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 2016 అక్టోబర్‌ 11న  మేడ్చల్‌–మల్కాజిగిరి ,వికారాబాద్‌ జిల్లాలు ఏర్పాటయ్యాయి.  

దాదాపు ఆరేళ్లుగా మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా పరిపాలన కీసర మండల కేంద్రం సమీపంలోని అద్దె భవనం నుంచి కొనసాగుతోంది. దీంతో కొన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రజలకు పారదర్శక పాలన, పరిపాలన సులభతరం.. అధికారుల్లో జవాబుదారీ తనం పెంచటం.. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే లక్ష్యంగా 2017 అక్టోబర్‌ 11న శామీర్‌పేట మండలం, తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లిలో జిల్లా కలెక్టరేట్‌  నిర్మాణానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌  పునాది వేసిన సంగతి తెలిసిందే. 

ఎన్నో ప్రత్యేకతలు 
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాల కార్యాలయాన్ని అంతాయిపల్లిలో 30 ఎకరాల  స్థలంలో రూ.56.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. భవనంలో విశాలమైన 55 గదులను నిర్మించడం తోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో ,ఏవో, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులకు ప్రత్యేక గదులు కేటాయించారు. జిల్లా మంత్రికి ప్రత్యేక చాంబర్‌ ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునేలా సమావేశమందిరాన్ని  ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ మైదానంలో హెలిప్యాడ్‌ నిర్మాణం చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top