
ఆదివారం మహిళా ఉద్యోగులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సీఎస్, స్మితా సబర్వాల్
సీఎస్ ఆధ్వర్యంలోని ఈ కమిటీలో ముఖ్య కార్యదర్శులు కె. రామకృష్ణారావు, రజత్‌కుమార్ ఉన్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ), పదోన్నతులు, ఇతర సమస్యలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తక్షణమే ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వారం, పది రోజుల్లో ఈ చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సీఎస్ ఆధ్వర్యంలోని ఈ కమిటీలో ముఖ్య కార్యదర్శులు కె. రామకృష్ణారావు, రజత్‌కుమార్ ఉన్నారు.
పీఆర్సీ నివేదిక అందినా...
రిటైర్డ్ ఐఏఎస్ సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) గత నెల 31న సీఎస్ సోమేశ్‌కుమార్‌కు తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్ భవన్‌లో పీఆర్సీ నివేదిక సమర్పించింది. జనవరి మూడో వారంలో పీఆర్సీ, పదవీ విరమణ వయసుపై ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ అదేరోజు ప్రగతి భవన్‌లో తనను కలిసిన టీఎన్జీవోలు, టీజీవో నేతలకు హామీ ఇచ్చారు. చదవండి: (పోలీసు శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో..!)
సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ జనవరి తొలి వారంలో పీఆర్సీ నివేదికపై అధ్యయనం జరిపి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని, జనవరి రెండో వారంలో నివేదిక సమర్పిస్తే మూడో వారంలో పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపుపై ప్రకటన చేస్తానని ఆ రోజు ఉద్యోగ సంఘాల నేతలతో పేర్కొన్నారు. అయితే ఈ నెలలో మూడు వారాలు గడిచిపోయినా ఇప్పటివరకు త్రిసభ్య కమిటీ సమావేశమై పీఆర్సీ నివేదికపై అధ్యయనం జరపడం లేదా ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవడం చేయలేదు. ఉద్యోగ సంఘాల నేతలు గత శుక్రవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో సీఎస్‌ను కలసి పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని వినతిపత్రం సమర్పించారు. పీఆర్సీపై తమను చర్చలకు ఆహ్వానించాలని కోరారు.
ఎట్టకేలకు కదలిక...
ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని త్రిసభ్య కమిటీని సీఎం కేసీఆర్ ఆదివారం ఆదేశించడంతో ఎట్టకేలకు పీఆర్సీ ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. సీఎం ఆదేశాలతో త్రిసభ్య కమిటీ సోమవారం లేదా బుధవారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా ఈ చర్చల ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి తొలి వారంలో సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోగా రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. ఆలోగా పీఆర్సీని ప్రకటించకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిల్లోనూ ఫిబ్రవరి తొలి వారంలో పీఆర్సీ ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొంది.
మహిళా ఉద్యోగుల భద్రతపై సీఎం హామీ
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం సందర్భంగా భోజన విరామ సమయంలో కేసీఆర్ మహిళా ఉద్యోగులతో ప్రత్యేకంగా మాట్లాడారు. శాఖలవారీగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు సౌకర్యవంతంగా విధులు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు. వారితో చర్చించి కావాల్సిన ఏర్పాట్లు చేసే బాధ్యతను తన కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు అప్పగించారు. తమపట్ల సీఎం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధకు మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.