పోలీసు శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో..!

No Clarity On Filling Of Vacancies In Telangana Police Department - Sakshi

పోలీసుశాఖలో ఖాళీల భర్తీపై రాని స్పష్టత 

దాదాపు 20 వేల ఖాళీలు గుర్తింపు 

ప్రభుత్వం నుంచి ఇంతవరకూ రాని ఆదేశాలు 

నోటిఫికేషన్‌ కోసం లక్షలాదిమంది అభ్యర్థుల ఎదురుచూపులు 

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు శాఖలో భర్తీ చేసే పోస్టులపై ఇంకా స్పష్టత రాలేదు. ఖాళీ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం, హోంమంత్రి ఇటీవల వేర్వేరు సందర్భాల్లో ప్రకటించారు. దీంతో ఖాళీలను గుర్తించిన పోలీసు శాఖ దాదాపు 20 వేల వరకు పోస్టుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో 19,300లకు పైగా కానిస్టేబుళ్లు, దాదాపు 450 వరకు ఎస్సై పోస్టులు ఉన్నాయి. డిసెంబర్‌లోనే ఈ పోస్టుల వివరాలను ప్రభుత్వానికి అందజేసినా.. రిక్రూట్‌మెంట్‌ విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

గతేడాది ప్రబలిన కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు, ఈ పరిస్థితుల్లో ఎన్ని పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందన్న ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది. సగం పోస్టులకైనా ఆర్థికశాఖ అనుమతిస్తుందా? లేక మొత్తం పోస్టుల భర్తీకి మొగ్గుచూపుతుందా? అన్న విషయం ప్రభుత్వ ఆదేశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర విషయాలపై ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా గతేడాది దాదాపు 10,300 కానిస్టేబుళ్లు, 1200 మంది ఎస్సైల పోస్టులను భర్తీ చేశారు. మరో 4 వేల మంది తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) కానిస్టేబుళ్లు శిక్షణలో ఉన్నారు. వీరు జూలై నాటికి శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరతారు.

సాధన షురూ..
పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి, హోంమంత్రి ప్రకటనల నేపథ్యంలో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. నోటిఫికేషన్‌ ఎప్పుడైనా వెలువడొచ్చన్న ప్రచారంతో.. లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు మైదానాల్లో శారీరక పరీక్షల కోసం సాధన ప్రారంభించారు. గతేడాది దాదాపు 18 వేల ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టులకు దాదాపు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి దాదాపు 7 లక్షల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని అంచనా.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top