CM KCR Review Meeting Conducted On RTC Charges in Pragati Bhavan - Sakshi
Sakshi News home page

చార్జీలు పెంచకుంటే బస్సు గట్టెక్కదు

Jan 22 2021 1:45 AM | Updated on Jan 22 2021 12:43 PM

CM KCR Conducted Review On RTC At Pragati Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఆర్థిక సహాయం అందించడం, బస్సు చార్జీలు పెంచడం వంటి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గట్టెక్కే పరిస్థి తి లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అధికారులు నివేదించారు. సీఎం గురువారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు ప్రభుత్వ సాయం, చార్జీల పెంపు సంబంధిత ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు.  

పెను భారం భరించే స్థితిలో ఆర్టీసీ లేదు 
‘చివరిసారిగా ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్‌ డీజిల్‌ ధర రూ.67 ఉండేది. కానీ చాలా స్వల్ప వ్యవధిలోనే ధర లీటర్‌కు రూ.15 పెరిగింది. ఇది ఆర్టీసీపై తీవ్ర ఆర్థిక భారం మోపింది. మరోవైపు కరోనా కారణంగా విధించిన లాక్‌ డౌన్‌తో సంస్థ అపార నష్టాలను చవిచూసింది. వీటితో పాటు ఇప్పటికే పేరుకుపోయిన రుణ బకాయిలతో సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లోనే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచా ల్సి ఉంది. ఒకవేళ జీతాలు పెంచితే సంస్థపై పెనుభారం తప్పదు. అది భరించే స్థితిలో ఆర్టీ సీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలి. అలాగే బస్సు చార్జీలు పెంచాలి. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ కోలుకునే పరిస్థితి ఉండదు..’అని అధికారులు వివరించారు.  చదవండి: (ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ షాక్‌..!)

గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగే.. 
‘వాస్తవానికి గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి ఎంతో మెరుగైంది. ప్రభుత్వం అందించిన ఇతోధిక సహాయం, ఆర్టీసీలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు తిప్పడం మంచి ఫలితాన్నిచ్చింది. 58 శాతానికి చేరుకున్న ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతోంది. రోజుకు రూ.9 కోట్ల ఆదాయం వస్తోంది. భవిష్యత్తులో మరింత పుంజుకునే అవకాశం ఉన్నా.. డీజిల్‌ రేట్లు పెరుగుతుండడం నష్టదాయకంగా మారుతోంది..’అని వివరించారు.  

‘కార్గో’తో మంచి ఆదాయం: సీఎం 
ఆర్టీసీ కార్గో సర్వీసులు విజయవంతం అయ్యాయని, ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. కార్గో సేవల ద్వారా ఇప్పటికి 17.72 లక్షల పార్సిళ్లను గమ్యానికి చేరవేశారని, దీనివల్ల ఆర్టీసీకి రూ.22.61 కోట్ల ఆదా యం వచ్చిందని చెప్పారు. ప్రజలు కూడా కార్గో సేవలపై సంతృప్తితో ఉన్నారంటూ.. ఆర్టీసీ కార్గో సేవల స్పెషల్‌ ఆఫీసర్‌ కృష్ణకాంత్‌ను సీఎం ప్రశంసించారు. ఆర్టీసీ కార్గో ద్వారా పంపిన పార్సిళ్లు సకాలంలో, సురక్షితంగా గమ్యం చేరుకుంటాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. అటు మారుమూల ప్రాంతాలకు, ఇటు నగరంలోని ఇంటింటికీ డోర్‌ డెలివరీ చేయడం అభినందనీయమన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement