ప్రజల ముంగిటకే న్యాయం

CJ RS Chauhan Hoisting National Flag At Telangana High Court  - Sakshi

వాదనలు వినిపించేందుకు ఐదు వ్యాన్‌లు ఏర్పాటు 

2,119 మంది ఉద్యోగులకు కరోనా కవచ్‌ బీమా 

స్వాతంత్య్ర వేడుకల్లో సీజే జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల ముంగిటకే న్యాయం అందించాలనే లక్ష్యంతో.. న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులు వాదించేందుకు వీలుగా మొబైల్‌ వ్యాన్స్‌ ఏర్పాటు చేశామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ అన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి వ్యాన్‌లను ఏర్పాటు చేసిన ఘనత మనదేనన్నారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ వ్యాన్‌లను ఏర్పాటు చేశామని, త్వరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దేశంలో మన హైకోర్టులోనే వీడియో కాన్ఫ రెన్స్‌ ద్వారా 9 బెంచ్‌లు రోజూ పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సైతం మన పనితీరును ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు.

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టు ఆవరణలో శనివారం జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీజే మాట్లాడారు. న్యాయ శాఖలో పనిచేస్తున్న 2,119 కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.2.5 లక్షల కరోనా కవచ్‌ బీమా పాలసీని అందించామని తెలిపారు. త్వరలోనే న్యాయస్థానాలు సాధారణంగా పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, ఏజీ బీఎస్‌ ప్రసాద్, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌రావు, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి, హైకోర్టు బార్‌ అసో సియేషన్‌ అధ్యక్షుడు సూర్యకరణ్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top