ఆర్టీసీని వణికించిన చైనా బ్యాటరీ | Chinese battery shakes RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని వణికించిన చైనా బ్యాటరీ

Jul 3 2026 3:00 AM | Updated on Jul 3 2026 3:00 AM

Chinese battery shakes RTC

ఎలక్ట్రిక్‌ బస్సుల్లో వెంటవెంటనే అగ్ని ప్రమాదాలు 

జేబీఎం కంపెనీకి చెందిన 500 ఎలక్ట్రిక్‌ బస్సులను నిలిపేసిన సంస్థ 

వాటి ప్రమాదాలకు కారణాలను విశ్లేషిస్తున్న కంపెనీ నిపుణులు

చైనా నుంచి వచ్చిన బ్యాటరీ తయారీ కంపెనీ ఇంజినీర్లు 

సమస్యకు శాశ్వత పరిష్కార హామీ వచ్చాకే తిరిగి తిప్పుతామన్న ఆర్టీసీ 

సాక్షి, హైదరాబాద్‌: చైనా బ్యాటరీ ఆర్టీసీని వణికిస్తోంది. దాదాపు వేయి ఎలక్ట్రిక్‌ బస్సులు తిప్పుతున్న ఆర్టీసీకి ఇప్పుడు వాటిల్లో చైనా తయారీ బ్యాటరీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఉన్నట్టుండి ఆ బ్యాటరీల నుంచి వచ్చే మంటలు బస్సులను దహించేస్తున్నాయి. దీంతో ప్రయాణికులున్న సమయంలో బస్సులు మండితే ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉండటమే దీనికి కారణం. మూడునాలుగు రోజుల తర్జనభర్జన తర్వాత, గత రెండు ప్రమాదాలకు గురైన జేబీఎం కంపెనీకి చెందిన అన్ని ఎలక్ట్రిక్‌ బస్సులను నిలిపేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. 

ప్రమాదాలకు కారణాలేంటి, భవిష్యత్‌లో మళ్లీ ప్రమాదాలు జరగకుండా తీసుకునే చర్యలేమిటి అన్న విషయంలో, ఆ బస్సులను అద్దెకిచ్చిన జేబీఎం కంపెనీ నుంచి సంతృప్తికర స్పందన వచ్చేవరకు ఆ బస్సులను డిపోలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. దీంతో గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ కంపెనీకి చెందిన 500 ఎలక్ట్రిక్‌ బస్సులు నిలిచిపోయాయి.  

బ్యాటరీలతోనే... 
నేషనల్‌ ఎలక్ట్రిక్‌ బస్‌ ప్రోగ్రాం పథకం కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన బస్సుల్లో, ఢిల్లీ ఫరీదాబాద్‌లోని జేబీఎం కంపెనీకి 500 బస్సుల సరఫరా టెండర్‌ దక్కింది. తన సొంత తయారీ బస్సులను ఆ సంస్థ ఏడాదిన్నర క్రితం ఆర్టీసీకి సరఫరా చేసింది. గ్రాస్‌కాస్ట్‌ కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఆ సంస్థ అద్దె ప్రాతిపదికన ఆ బస్సులను వరంగల్, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్‌లో తిప్పుతోంది. ఇటీవల ఆ బస్సుల్లో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని నెలల క్రితం ఓ బస్సుకు నిప్పంటుకోగా, గత నెల 21న మరో బస్సు బుగ్గయింది. 

ఈ ప్రమాదానికి సంబంధించి నివేదిక అందేలోపే మూడు రోజుల క్రితం మరో బస్సు డిపోలో ఉండగా దగ్ధమైంది. వెంటవెంటనే రెండు ప్రమాదాలు చోటుచేసుకోవటం, రెండింటిలోనూ బ్యాటరీ నుంచే నిప్పు రావటంతో బ్యాటరీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఆర్టీసీ నిర్ధారణకు వచ్చింది. వెంటనే విషయాన్ని జేబీఎం సంస్థకు తెలిపి, కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఆ కంపెనీ సాంకేతిక సిబ్బందితోపాటు బ్యాటరీ తయారు చేసిన చైనా కంపెనీ సిబ్బంది కూడా తెలంగాణకు వచ్చి బస్సులను పరిశీలించారు.  

కంపెనీకి షరతులు  
అద్దె ప్రాతిపదికపై తిప్పుతున్నందున, ఆ బస్సులను సురక్షితమైనవని నివేదిక ఇచ్చేంతవరకు డిపోలకే పరిమితం చేస్తామని ఆర్టీసీ ఆ సంస్థకు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. 
» ప్రస్తుతం సమస్యకు కారణమేమిటో స్పష్టంగా తెలపాలి. శాశ్వత పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు వివరించాలి. 
»  హైదరాబాద్‌ బస్‌భవన్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఆ బస్సుల పనితీరును స్వయంగా పరిశీలించాలి.  
»  చైనా తయారీ బ్యాటరీ సురక్షితమని నమ్మకం కలిగించాలి. ఇక బస్సులు తిరిగి తిప్పేందుకు అన్ని విధాలా సురక్షితం, సిద్ధమని లిఖితపూర్వకంగా స్పష్టం చేయాలి. 

కంపెనీ నమ్మకమైందే.. చైనా బ్యాటరీలతోనే సమస్యలు  
ఢిల్లీ ఫరీదాబాద్‌కు చెందిన జై భారత్‌ మారుతీ ఆటో లిమిటెడ్‌ కంపెనీ సొంతంగా ఎలక్ట్రిక్‌ బస్సులు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా 3,500 ఎలక్ట్రిక్‌ బస్సులను వివిధ ఆర్టీసీల్లో అద్దె ప్రాతిపదికన తిప్పుతోంది. విమానాశ్రయాల్లో ప్రయాణికులను విమానాల వద్దకు చేర్చే ఎలక్ట్రిక్‌ బస్సులను కూడా ఈ సంస్థ తిప్పుతోంది. బస్సుల తయారీలో ఈ సంస్థకు మంచి పేరే ఉంది. కానీ, బ్యాటరీలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది.  

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు  
ఒకేసారి 500 బస్సులను నిలిపేయటంతో ఆయా రూట్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్పేర్‌లో ఉన్న 300 సాధారణ డీజిల్‌ బస్సులను ఆయా రూట్లలో ప్రారంభిస్తున్నారు. వీటితోపాటు హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో లగ్జరీ బస్సులను ఆయా రూట్లలోనికి మళ్లిస్తున్నారు. కానీ, మరిన్ని బస్సులు వస్తేనే సర్వీసులను పునరుద్ధరించే వీలుంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement