ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద హైటెన్షన్‌.. సీబీఐకి సవాలే! 

CBI To Interrogate MLC Kavitha In Delhi Liquor Scam Case On Sunday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాపై నమోదు చేసిన కేసులో.. ఆదివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ విచారించనుంది. ఈ నెల 11న విచారణకు తన నివాసంలో అందుబాటులో ఉంటానని కవిత తెలియజేయగా, సీబీఐ కూడా అందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. 

సీబీఐ నోటీసుల నేపథ్యంలో కవిత ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు వరుసగా మూడురోజుల పాటు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అలాగే న్యాయ నిపుణులతోనూ సంప్రదింపులు జరిపారు. ఆదివారం జరిగే విచారణ సందర్భంగా కూడా ఆమె న్యాయ నిపుణుల సాయాన్ని తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. కాగా కవితకు సీబీఐ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసింది.  

భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు.. 
మరోవైపు పార్టీ శ్రేణులు వారం రోజులుగా పెద్దయెత్తున బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. దీంతో పోలీసులు అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. ‘డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌.. విల్‌ నెవర్‌ ఫియర్‌’(యోధుడి కుమార్తె.. ఎప్పుడూ భయపడదు), ‘వుయ్‌ ఆర్‌ విత్‌ యూ కవితక్కా..’(మేము నీతో ఉన్నాం కవితక్కా..) అంటూ కవిత నివాస పరిసర ప్రాంతాలతో పాటు పలుచోట్ల పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఇలావుండగా కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించేలా కృషి చేసినందుకు గాను కవితకు ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్‌ సంజయ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ఈఓ, పూజారులు కవితకు వేద ఆశీర్వచనాలు అందజేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top