రేవంత్‌రెడ్డి ఫొటో మార్ఫింగ్‌పై మద్దూర్‌లో...
కోమటిరెడ్డిపై దుష్ప్రచారంతో సిటీ సీసీఎస్‌లో కేసు నమోదు
ఈ రెండింటినీ కలిపి విచారించనున్న స్పెషల్ టీమ్
సిటీ జాయింట్ సీపీ ఎన్.శ్వేత నేతృత్వంలో 8 మందితో ఏర్పాటు
పర్యవేక్షించనున్న వీసీ సజ్జనార్.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోను అసభ్యంగా మార్ఫింగ్ చేయడం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అనుచిత కథనాల ప్రసారాన్ని పోలీస్ విభాగం సీరియస్‌గా తీసుకుంది. ఈ రెండు కేసుల్నీ దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ పర్యవేక్షణలో పనిచేసే ఈ సిట్‌కు సిటీ నార్త్ రేంజ్ జాయింట్ సీపీ ఎన్.శ్వేత నేతృత్వం వహిస్తారు. ఇందులో మొత్తం 8 మంది అధికారులను నియమించారు. ఇప్పటికే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన అధికారిక సిట్‌ను సజ్జనారే పర్యవేక్షిస్తున్నారు.
⇒ సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోను అసభ్యంగా మారి్ఫంగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.నర్సింహ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటకొండ గ్రామానికి చెందిన కావలి వెంకటేశ్ అసభ్యంగా మారి్ఫంగ్ చేశారని, దాన్ని ‘తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్’లో పోస్టు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
⇒ రాష్ట్ర కేడర్‌లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణిని ప్రస్తావిస్తూ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై జరిగిన దుష్ఫ్రచారానికి సంబంధించి ఐఏఎస్ అ«ధికారుల సంఘం కార్యదర్శి జయేశ్‌రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఇందులో టీవీ, యూట్యూబ్ చానళ్లతోపాటు వెబ్‌సైట్లు కలిపి తొమ్మిదింటిని నిందితుల జాబితాలో చేర్చారు. ఈ ఫిర్యాదు, కేసు ల్లో ఎక్కడా కోమటిరెడ్డి పేరు లేకపోయినా, ఆయన ఇటీవలే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ కథనాలను ఖండించిన విషయం విదితమే.
ఈ రెండు కేసుల్లోని అంశాలను తీవ్రంగా పరిగణించిన పోలీసు విభాగం సిట్ ఏర్పాటు చేసి, రెండు కేసుల్నీ అక్కడకు బదిలీ చేసింది. ఈ సిట్‌లో కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న సీసీఎస్ టీమ్–10 ఏసీపీ జి.గురు రాఘవేంద్రతోపాటు చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతం, హైదరాబాద్ పరిపాలన విభా గం డీసీపీ కె.వెంకటలక్ష్మి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి.అరవింద్ బాబు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఎస్పీ బి.ప్రతాప్ కుమార్, హైదరాబాద్ ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ సి.శంకర్‌రెడ్డి, షీ–సైబర్ సెల్ ఎస్సై పి.హరీశ్ సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు కేసుల దర్యాప్తు పూర్తి చేసే సిట్ అభియోగపత్రాల దాఖలు వరకు బాధ్యత తీసుకోనుంది. సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే కొన్ని చోట్ల సోదాలు సైతం చేశారు.


