ఇంజన్‌లో సాంకేతిక లోపంతో ప్రమాదం
ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దింపిన డ్రైవర్
చిట్యాల: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఇంజన్‌లో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. విహారి ట్రావెల్స్‌కు చెందిన ఈ స్లీపర్ కోచ్ బస్సు సోమవారం రాత్రి 12 గంటల తరువాత హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కొండాపురం గ్రామానికి 29 మంది ప్రయాణికులతో బయలుదేరింది.
జాతీయ రహదారిపై చౌటుప్పల్ శివారులోకి రాగానే టీ బ్రేక్ కోసం బస్సును కాసేపు ఆపారు. అనంతరం బస్సు రాత్రి 1.30 గంటల సమయంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పరిధిలోకి రాగానే ఇంజన్‌లో పొగ రావటాన్ని డ్రైవర్ గమనించాడు. దీంతో బస్సును రహదారి పక్కన నిలిపివేసి, ప్రయాణికులను అప్రమత్తం చేశాడు.
ప్రయాణికులు బస్సు ప్రధాన ద్వారంతో పాటు వెనక ఉన్న ఎమర్జెన్సీ డోర్ గుండా బయటకు వచ్చారు. కొద్దిసేపట్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. డీజిల్ ట్యాంకులో నిండుగా డీజిల్ ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున లేచి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ప్రమాద స్థలానికి రామన్నపేట, చౌటుప్పల్‌కు చెందిన అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆరి్పవేశారు. పోలీసులు వచ్చి ప్రయాణికులను ఇతర వాహనాలలో గమ్యస్థానాలకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.
పొగతో మంటలు లేచాయి: ఆదిలక్ష్మమ్మ, అత్తిలి
హైదరాబాద్ నుంచి విహారి ట్రావెల్స్ బస్సులో అత్తిలికి ప్రయాణిస్తున్నాము. వెలిమినేడు గ్రామ శివారులోకి రాగానే బస్సు ఇంజన్ నుంచి పొగ వాసన రావడం మొదలైంది. వెంటనే డ్రైవర్ మమ్మల్ని అప్రమత్తం చేసి కిందకి దింపాడు. అనంతరం బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.


