
కోటేశ్వరరావుకు కండువా కప్పి పార్టీలో ఆహ్వానిస్తున్న టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి తదితరులు
కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు
మహేశ్‌గౌడ్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి కొండబాల
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇందుకోసం అందరం చేయి చేయి కలిపి పనిచేద్దామని కోరారు. సోమవారం గాందీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ల సమక్షంలో ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావుతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కొండబాలకు పార్టీ కండువా కప్పిన పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ పార్టీలోకి ఆహా్వనించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి భట్టి మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని, వారి అవసరాలు తీర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు అన్ని విషయాలపై అవగాహన కలిగిన కొండబాల లాంటి నేతలు పార్టీలోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు.
మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కొండబాల తన సొంత ఇంటికి తిరిగి వచ్చారని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వరరావుతో పాటు ఖమ్మం జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.