జాహ్నవి మృతిపై అమెరికా కోర్టు తీర్పు.. స్పందించిన కేటీఆర్‌

BRS KTR Reacts Over Jhanavi Kandula Death In USA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ క్రమంలో అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పు కామెంట్స్‌ను కేటీఆర్‌ ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్‌ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించారు. 

కాగా, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్‌పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు వ్యాఖ్యలు చేసింది. అతడిపై ఎలాంటి చర్యలు ఉండబోవని తెలిపింది. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి. 

భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకొని, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలి. అనేక ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం. అయితే ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరం అని కామెంట్స్‌ చేశారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. గతేడాది అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జాహ్నవి మృతి చెందింది. రోడ్డు దాటుతున్న ఆమెను.. పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి కెవిన్ డేవ్‌ చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్‌.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. 

స్థానిక మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో కెవిన్‌ విధి నిర్వహణలోనే ఉన్నారు. ఆ రూటులో స్పీడ్ లిమిట్ 40 మైళ్లు మాత్రమే. కానీ, కెవిన్‌ తన కారును 100 మైళ్లకు పైగా వేగంతో నడిపారు. ఎమర్జెన్సీ హారన్‌ ఇవ్వలేదుగానీ.. లైట్లను వెలిగించుకుంటూ వెళ్లారు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న జాహ్నవి.. అత్యంత వేగంతో కారు దూసుకురావడాన్ని అంచనా వేయలేకపోయారు.  కారు నడుపుతున్న కెవిన్ డేవ్ కూడా జాహ్నవిని ఢీకొట్టడానికి ఒక్క సెకను ముందు మాత్రమే బ్రేకులు వేశాడు. కారు బలంగా ఢీకొట్టడంతో జాహ్నవి ఎగిరి 100 మీటర్లకు పైగా దూరంలో పడిపోయారని సీటెల్ పోలీసులు తమ నివేదికలో రిపోర్టులో పేర్కొన్నారు.

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top