
కొందుర్గు/ సిద్దిపేట అర్బన్: అమెరికాలోని ఫ్లోరిడా లో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు మృత్యు వాత పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులను పురుమాండ్ల సునీత (56), ఆమె కోడలు ప్రగతిరెడ్డి (35), మనవడు హర్వీన్‌రెడ్డి (6)గా గుర్తించారు. బాధిత కుటుంబానికి చెందినవారు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల గ్రామానికి చెందిన పురుమాండ్ల దుర్గా రెడ్డి, భార్య సునీతతో కలిసి 40 సంవత్సరాలుగా విదేశాల్లోనే ఉంటున్నారు.
ప్రస్తుతం ఉగాండాలో ఉంటున్నారు. వీరి కుమారుడు రోహిత్‌రెడ్డి వివా హం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకుల పల్లి గ్రామానికి చెందిన పవిత్ర, మోహన్‌రెడ్డి దంపతుల కుమార్తె ప్రగతి రెడ్డితో జరిగింది. రోహి త్, ప్రగతి ఫ్లోరిడాలోని హర్లాండోలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేస్తు న్నారు. వీరికి హర్వీన్ (6)తో పాటు 8 నెలల వయస్సు గల మరో కుమారుడు ఉన్నారు.
భార్య సునీతతో కలిసి ఇటీవల ఫ్లోరిడా వచ్చిన దుర్గారెడ్డి తిరిగి ఉగాండా వెళ్లిపోగా సునీత అక్కడే ఉండిపోయారు. కాగా ప్రగతిరెడ్డి అక్క ప్రియాంక రెడ్డి కూడా భర్త నవీన్‌రెడ్డి, కుమారుడు, కుమార్తెతో కలిసి ఫ్లోరిడాలోనే జాక్సన్ విల్లేలో ఉంటున్నారు. రెండు నగరాల మధ్య దూరం సుమారు 200 కి.మీ కాగా వారాంతంలో రెండు కుటుంబాలు కలిసి రెండు కార్లలో టూర్‌కు వెళ్లాయి. సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా..రోహిత్‌రెడ్డి కుటుంబం ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రగతిరెడ్డి, హర్వీన్, సునీత అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రోహిత్, బాబు మాత్రం ప్రమాదం నుంచి బయట పడ్డారని, అయితే బాలుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. కాగా మృతుల అంత్యక్రియలు ఫ్లోరిడాలోనే నిర్వహించనున్నట్లు తెలిసింది. సిద్దిపేటలో నివాసం ఉంటున్న దుర్గారెడ్డి తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి కుటుంబసభ్యులు హుటాహుటిన అమెరికాకు ప్రయాణమయ్యారు.
10 నిమిషాల ముందే ఆ కారెక్కిన హర్వీన్
హర్వీన్ తిరుగు ప్రయాణంలో తొలుత తమ పెద్దమ్మ వాళ్ల కారు ఎక్కాడు. ప్రమాదం జరగడానికి పది నిమిషాల ముందే అమ్మానాన్న ప్రయాణిస్తున్న కారులోకి వచ్చాడని, అంతలోనే దుర్ఘటన చోటు చేసుకుందని తెలిసింది. ప్రమాద వార్త తెలియడంతో ఇటు టేకులపల్లిలో, అటు బక్రిచెప్యాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మూడు రోజుల క్రితమే మాట్లాడింది..
తన కూతురు మూడురోజుల క్రితమే ఫోన్‌లో మాట్లాడిందని, ఇంతలోనే మృత్యు ఒడికి చేరిందంటూ ప్రగతి తల్లి పవిత్ర విలపించారు. అమెరికా వెళ్లిన తాము గత డిసెంబర్ 3న తిరిగి వచ్చామని, తాము వచ్చే ముందే చిన్నబాబును చూసుకోవడానికి సునీత అమెరికా వెళ్లారని తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు ప్రగతిరెడ్డి తల్లిదండ్రులను పరామర్శించారు.
