
న్యూట్రాన్ స్టార్ ఢీకొట్టడమే కారణం
భూగోళంతో పాటు ఇతర గ్రహాలు, సూర్యుడు, అసంఖ్యాకమైన నక్షత్రాలున్న మన పాలపుంతలో అంతరిక్ష ఎముకలు (కాస్మిక్ బోన్సు) కూడా ఉంటాయని మీకు తెలుసా? నిలువుగా, సన్నగా ఉండే వీటిని ఆకారం వల్ల ఎముకలుగా పిలుస్తుంటారు. వ్యోమగాములకు అంతరిక్షం నుంచి ఇవి సర్పాకృతిలో కనిపిస్తుంటాయి. ఇవీ ఒకరకంగా నక్షత్రాల్లాంటివే. వీటి నుంచి రేడియో తరంగాలు వెలువడుతాయి. భూమి నుంచి 26 వేల కాంతి సంవత్సరాల దూరంలో పాలపుంత మధ్యభాగానికి సమీపంలో ఉన్న జీ359.13 అనే ఇలాంటి కాస్మిక్ బోన్‌కు పగుళ్లు వచ్చినట్లు సైంటిస్టులు తాజాగా గుర్తించారు.
ఇది మన పాలపుంతలో అత్యంత పొడవైన, ప్రకాశవంతమైన ఎముకల్లో ఒకటి. పల్సర్ అనే న్యూట్రాన్ స్టార్ గంటకు ఏకంగా 20 లక్షల మైళ్ల వేగంతో ఢీకొట్టడం వల్లే ఈ పగుళ్లు ఏర్పడినట్లు చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీతో పాటు ఇతర రేడియో టెలిస్కోప్‌ల ద్వారా కనిపెట్టారు. ఈ చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. భారీ నక్షత్రాలు పేలిపోవడం వల్ల న్యూట్రాన్ నక్షత్రాలు ఏర్పడుతుంటాయి. అవి అత్యధిక ఆయస్కాంత శక్తిని కలిగి ఉండి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్‌ను వెలువరిస్తాయి. సెకనుకు కొన్ని వందలసార్లు తమ చుట్టూ తాము తిరుగుతూ అంతరిక్షంలోకి వేగంగా దూసుకెళ్తాయి. దారికి అడ్డొచ్చివాటిని అడ్డంగా ఢీకొంటాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్