‘ఆపాత’ పాలపుంతలు!

James Webb Space Telescope sees Milky Way mimics 11 billion years ago - Sakshi

వాషింగ్టన్‌: అచ్చం మన పాలపుంత మాదిరిగా ఉండే నక్షత్ర మండలాలను నాసా జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తాజాగా గుర్తించింది. ఇవన్నీ విశ్వం ప్రస్తుత వయసులో కేవలం మూడో వంతు ఉన్నప్పుడు, అంటే దాదాపు 1,100 కోట్ల ఏళ్ల కింద ఏర్పడ్డాయట! ఈ క్రమంలో విశ్వంలోకెల్లా అత్యంత పురాతన నక్షత్ర మండలాన్ని కూడా జేమ్స్‌ వెబ్‌ గుర్తించింది. అది ఏకంగా 1,350 కోట్ల ఏళ్లనాటిదట. అప్పటికి విశ్వం ఆవిర్భవించి కేవలం 30 కోట్ల ఏళ్లేనట!

ఈ నక్షత్ర మండలాల కేంద్ర స్థానం నుంచి ఇతర నక్షత్ర రాశుల దాకా విస్తరించి ఉన్న స్టెల్లర్‌ బార్స్‌ను కూడా వీటిలో గమనించడం విశేషం. ఈ బార్స్‌ మన పాలపుంతలోనూ ఉన్నాయి. అయితే విశ్వపు తొలి యుగాల నాటి నక్షత్ర మండలాల్లో ఇవి కన్పించడం ఇదే తొలిసారని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఆస్ట్రానమీ ప్రొఫెసర్‌ శ్రద్ధా జోగీ అన్నారు. ఈ నేపథ్యంలో నక్షత్ర మండలాల పుట్టుక, వికాసాలను గురించిన సిద్ధాంతాలను సరిచూసుకోవాల్సి రావచ్చని అభిప్రాయపడ్డారు.

ఇలాంటి నక్షత్ర మండలాలను గతంలో హబుల్‌ టెలిస్కోప్‌ కూడా గుర్తించినా వాటిలో ఈ బార్స్‌ కనిపించలేదన్నారు. ‘‘ఇవి నక్షత్రాలతో పాటు అంతరిక్ష ధూళి, వాయువుల కదలికలను ప్రభావితం చేయడంతో పాటు తారల పుట్టుక ప్రక్రియను వేగవంతం చేయడంలోనూ సాయపడతాయి. అంతేగాక నక్షత్ర మండలాల కేంద్ర స్థానాల్లో అతి భారీ కృష్ణబిలాల పుట్టుకకూ దోహదం చేస్తుంటాయి. ఒకవిధంగా ఇవి నక్షత్ర మండలాల్లో సరఫరా వ్యవస్థ పాత్ర పోషిస్తుంటాయి. విశ్వపు తొలి యుగాల నాటి నక్షత్ర మండలాల్లోని స్టెల్లర్‌ బార్స్‌పై తొలిసారిగా పరిశోధన చేస్తున్నది మేమే. ఇది ఇప్పటిదాకా ఎవరూ చూడని కీకారణ్యంలోకి తొలిసారి అడుగు పెట్టడం వంటిదే’’ అంటూ శ్రద్ధా ముక్తాయించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top