
తొలిసారిగా గుర్తించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్
వాషింగ్టన్: జీవుల మనుగడకు ప్రాణాధారమైన నీరు అంతరిక్షంలో మరెక్కడుందోననే ప్రశ్నకు సమాధానం వెతికినట్లు ప్రఖ్యాత జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ తాజాగా ప్రకటించింది. మన సౌరమండలం తరహాలోనే ఇతర నక్షత్ర వ్యవస్థల్లో గడ్డ కట్టిన స్థితిలో నీరు ఉంటుందనే వాదనకు బలం చేకూరుస్తూ నాసా వారి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పలు సాక్ష్యాధారాలను సంపాదించింది.
ఒక యువ నక్షత్ర మండలంలో గడ్డకట్టిన నీటి జాడలను కనిపెట్టినట్లు నాసా తాజాగా ప్రకటించింది. నక్షత్రం చుట్టూ తిరుగుతున్న దుమ్ము ధూళితో కూడిన అంతరిక్ష శిలలు, శకలాలు, శిథిలాల వలయాల్లో నీరు గడ్డకట్టి ఉందని నాసా వెల్లడించింది. మన సౌరవ్యవస్థ వయసుతో పోలిస్తే తక్కువ వయసున్న ఈ కొత్త నక్షత్ర మండలం ‘హెచ్‌డీ 181327’మన భూమికి 155 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని నాసా తెలిపింది.
వెబ్ టెలిస్కోప్ పంపిన ‘స్పె్రక్టా’డేటాలో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విశాల అంతరిక్షంలో ఎక్కడో ఓ చోట నీరు నిక్షిప్తమై ఉంటుందని నాసా వారి స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ 2008లోనే కొంత డేటాను పంపించింది. ఆ తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇలా నీటిజాడలను వెతికిపట్టడం ఇదే తొలిసారి. ‘‘కేవలం నీటిని మాత్రమేకాదు మరీముఖ్యంగా స్ఫటికాకృతిలో ఉండే గడ్డ కట్టిన నీటి జాడను వెబ్ టెలిస్కోప్ కనుగొంది.
ఈ ధూళి వలయాల్లోని ప్రతి దుమ్ము కణంతో నీటి అణువులు కలిసిపోయి ఉన్నాయి. ఈ అణువులను సమీప–పరారుణ స్పెక్ట్రోగ్రాఫ్ ఉపకరణంతో చూసినప్పుడు ఇవన్నీ మంచు బంతుల్లా కనిపించాయి. గతంలో ఇలాంటి క్రిస్టల్ ఐస్‌ను మన సౌరవ్యవస్థలో శనిగ్రహ వలయాల్లో, క్యూపర్ బెల్ట్‌లో చూశాం’’అని ఈ పరిశోధనా పత్రం ముఖ్య రచయిత చెన్ గ్జీ చెప్పారు. చెన్ గ్జీ.. మేరిలాండ్‌లోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ(బాలీ్టమోర్)లో అసిస్టెంట్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా సేవలందిస్తున్నారు. సంబంధిత వివరాలు ‘నేచర్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
నీరే కీలకం
అంతరిక్షంలో నక్షత్రాల చుట్టూతా గ్రహ వ్యవస్థ పురుడుపోసుకోవడానికి నీరే ప్రధాన కారణం. యువ నక్షత్రాల చుట్టూతా పరుచుకున్న దుమ్ము, ధూళి వలయాల్లో ప్రధాన ముడి సరకు నీరే. ఒక రకంగా పట్టిఉంచే నీరు సైతం ధూళి, దుమ్మ గట్టిపడి గ్రహాల ఆవిర్భావానికి దారితీస్తుంది. తక్కువ గురుత్వాకర్షణ సందర్భాల్లో తోకచుక్కలు, గ్రహశకలాల వంటివి ఏర్పడతాయి. ఒకవేళ బలాలు బలపడితే ఇవన్నీ కలగలిసిపోయి పెద్ద గ్రహాలుగా రూపాంతరం చెందుతాయి. మన భూమి సైతం తొలినాళ్లలో ఇలాగే ఏర్పడింది.
తాజాగా వెబ్ టెలిస్కోప్ సేకరించిన సమాచారంతో ఇతర ఖగోళ అధ్యయనకారులు సైతం నూతన నక్షత్రవ్యవస్థల్లో కొత్త గ్రహాలు ఎలా ఏర్పడతాయి వంటి అంశాలపై మరింత శోధన చేసేందుకు అవకాశం లభించనుందని మరో రచయిత క్రిస్టీన్ చెన్ చెప్పారు. ఈ ‘హెచ్‌డీ 181327’నక్షత్ర వ్యవస్థ కేవలం 2.3 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. మన సూర్యుడు ఏకంగా 460 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించాడు. వయసులో చిన్నదైనా సరే ఈ యువ నక్షత్రం మన సూరీడి కంటే బరువు ఎక్కువగా ఉంది. వేడి కూడా మరింత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.